నవ వధువు ఆత్మహత్య

24 Aug, 2018 06:09 IST|Sakshi
బావిని పరిశీలించి, విచారిస్తున్న తహíసీల్దార్‌ అప్పలనాయుడు, ఎస్‌ఐ హరికృష్ణ, భూలక్ష్మి మృతదేహం

పెళ్లయిన మూడు నెలలకే బలవన్మరణం

శోకసంద్రంలో కొండపాలెం

విశాఖపట్నం, రోలుగుంట(చోడవరం): పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంది. భర్త వద్ద రెండు నెలలు ఉండి, ఆషాఢ మాసంలో అమ్మవారింటికి వచ్చింది. శ్రావణ మాసం రావడంతో అత్తవారు కోడలిని తమ ఇంటికి పంపించాలని కోరారు. మరో వారంలో  కుమార్తెను అత్తవారింటికి పంపించేం దుకు  ఆ తల్లి అన్నీ సిద్ధం చేసుకుని కుమార్తెతో బుధవారం రాత్రి ఆ విషయం చెప్పింది.   మరి ఆ రాత్రి నవవధువు భూలక్ష్మి(19) ఏమనుకుందో, ఏమో గాని  గురువారం రోలుగుంట సమీపంలో చెక్కల మిల్లు వద్ద బావిలో శవమై తేలింది. ఈ సంఘటన మండలవాసులను కలచివేస్తుంది. దీనికి సంబంధించిన స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలం కొండపాలెం గ్రామానికి చెందిన పిల్లా సత్తిబాబు, మణమ్మలకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. 

కుమార్తెకు ఆరేళ్ల వయస్సు దాటిన తరువాత సత్తిబాబు అనారోగ్యంతో మృతి చెందాడు. అప్పటి నుంచి కుమారుడు స్వామిని, కుమార్తె భూలక్ష్మిని తల్లి మణమ్మ కూలిపనులు చేస్తూ పోషించింది.  కుమార్తెకు  మాకవరపాలెం మండలం గిడితూరు గ్రామానికి చెందిన అధికారి అప్పలనాయుడు, వరలక్ష్మిల కుమారుడు శ్రీనుతో ఈ ఏడాది  మే 3వ తేదీన   వివాహం జరిపించింది. అందరూ ఆనందించారు. అయితే  విధి వక్రీకరించింది.  ఆషాఢమాసానికి తన ఇంటికి వచ్చిన బిడ్డ, శ్రావణమాసంలో ఆనందంగా  అత్తవారింటికి  వెళుతుందని తల్లి పెట్టుకున్న ఆశలు ఆడియాసలయ్యాయి. కుమార్తె చనిపోయిన విషయం తెలుసుకున్న ఆమె గుండెలు ఆవిసేలా రోదించింది. కుమార్తె మృతి చెందిన విషయాన్ని గురువారం  స్థానిక పోలీసులకు మణమ్మ   ఫిర్యాదు చేసింది. వివాహబంధంపై అంగాహన లేకే ఇలా చేసి ఉంటుందని ఫిర్యాదులో పేర్కొంది. ఎస్‌ఐ హరికృష్ణ, మండల మేజిస్ట్రేట్‌ పి.అప్పలనాయుడితో కలసి బావి వద్దకు వెళ్లి పరిశీలించారు. మృతురాలి కుటుంబ సభ్యులను, బంధువులను విచా రించారు. గ్రామ పెద్దల సమక్షంలో పంచనామా నిర్వహించారు.  నర్సీపట్నం ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని  కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ సంఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

మరిన్ని వార్తలు