నవవధువు ఆత్మహత్య

20 Oct, 2019 07:54 IST|Sakshi
మమత (ఫైల్‌)

అడ్డగుట్ట: వరకట్న వేధింపులు తాళలేక నవవధువు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన లాలాగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. లాలాగూడ రైల్వే క్వార్టర్స్‌కు చెందిన వెంకటేశ్వర్‌ లాలాగూడ క్యారేజ్‌ వర్క్‌షాప్‌లో టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు. ఇతనికి మూడు నెలల క్రితం ఆలేర్‌లోని కొలన్‌పాకకు చెందిన మమత(లాస్య)(20)తో వివాహం జరిగింది. కట్న కానుకలు రూ. 3లక్షలు, ఒక ప్లాట్‌ ఇచ్చి పెళ్లి చేశారు. నెల రోజులపాటు వీరి కాపురం సజావుగా సాగింది. తరువాత భర్త, అత్త, ఆడపడుచులు వరకట్నం విషయంలో మమతను నిత్యం వేధింపులకు గురి చేస్తుండేవారు. వేధింపులు ఎక్కువవ్వడంతో మమత తీవ్ర మనోవేదనకు గురైంది. శనివారం ఉదయం భర్త టిఫిన్‌ తీసుకురావడానికి బయటకు వెళ్లగా ఇంట్లో ఎవరూలేని సమయంలో మమత సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆలస్యంగా విషయం తెలుసుకున్న కుటుంసభ్యులు గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 

వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య
చందానగర్‌: వరకట్న వేధింపులు తాళలేక ఓ మహిళ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన చందానగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన మేరకు.. రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం చక్కలగూడెం గ్రామానికి చెందిన నర్సింహులు, మల్లమ్మల చిన్న కుమార్తె సంధ్య (24) అదే గ్రామానికి చెందిన వెంకట్‌ను ప్రేమించి 6 సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నారు. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఐదేళ్ల క్రితం నగరానికి వచ్చి చందానగర్‌లోని పాపిరెడ్డి కాలనీలో నివాసముంటున్నారు.  వెంకట్‌ కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కొద్ది రోజుల నుంచి వెంకట్‌ భార్య సంధ్యను కట్నం తీసుకురావాలని లేకపోతే తన పేరు మీద భూమిని రాయించాలని వేధిస్తున్నాడు.దీంతో సంధ్య శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు