గాయపడిన నవవధువు మృతి

5 Apr, 2018 08:56 IST|Sakshi
షమీన (ఫైల్‌)

మదనపల్లె క్రైం: గత నెల 22వ తేదీన అదనపు కట్నం తీసుకురాలేదని భర్త కిరోసిన్‌ పోసి నిప్పటించడంతో తీవ్రంగా గాయపడిన నవ వధువు 12 రోజులు మృత్యువుతో పోరాడి బుధవారం రుయా ఆస్పత్రిలో మృతిచెందింది. మృతురాలి కుటుంబ సభ్యులు, ముదివేడు ఎస్‌ఐ వెంకటేశ్వర్లు కథనం మేరకు.. కురబలకోట మండలం అంగళ్లు పంచాయతీ నందిరెడ్డిపల్లెకు చెందిన సయ్యద్‌బాషా తన కుమార్తె షమీన(20)ను ఐదు నెలల క్రితం అంగళ్లులో ఉంటున్న ఎస్‌.కె ఇస్మాయిల్‌కు ఇచ్చి పెళ్లి చేశాడు.

ఆమెకు ఐదు నెలలకే అత్తగారి వేధింపులు మొదలయ్యాయి. షమీనాను భర్త ఇస్మాయిల్, ఆడబిడ్డ గుల్‌జార్, అత్తామామలు రెడ్డిబూ, దస్తగిరి అదనపు కట్నం తీసుకురావాలని వేధింపులకు పాల్పడ్డారు. ఆమె డబ్బు తీసుకురాకపోవడంతో గత నెల 22వ తేదీన షమీనాపై భర్త కిరోసిన్‌ పోసి నిప్పంటించాడు. 80 శాతం శరీరం కాలిపోయిన షమీనాను స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో డాక్టర్లు తిరుపతి రుయాకు రెఫర్‌ చేశారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ బుధవారం పరిస్థితి విషమించి మృతిచెందింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

మరిన్ని వార్తలు