పెళ్ళైన రోజే నవ వధువు అదృశ్యం

29 May, 2018 12:19 IST|Sakshi

సాక్షి, కడప:  ఉదయం వివాహం చేసుకున్న వధువు.. రాత్రికి అదృశ్యమైన ఘటన కడప జిల్లా రాజంపేట మండల పరిధిలోని అత్తిరాలలో జరిగింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం.. స్థానిక వినాయక్ నగర్ ప్రాంతంలో నివసించే రమణమ్మ కుమార్తె సునీతకు ఈ నెల 25వ తేదీ ఉదయం కోడూరుకు చెందిన వెంకటసుబ్బయ్య అనే యువకుడితో అక్కడే వివాహం అయింది.

అదే రోజు సాయంత్రం భర్తతో కలసి వధువు పుట్టింటికి వచ్చింది. రాత్రి పూట ఇంటి బయట అటూ ఇటూ తిరుగుతున్న సునీత ఒక్కసారిగా అదృశ్యమైంది. కల్యాణం అయిన కొద్ది గంటల్లోనే సునీత కనిపించకపోవడంతో కంగారుపడ్డ భర్త, కుటుంబ సభ్యులు చుట్టు పక్కన ఇళ్లలో వెతికినా ఫలితం దక్కలేదు. దీంతో సునీత తల్లి రమణమ్మ రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన ఎస్‌ఐ మహేష్‌ నాయుడు దర్యాఫ్తు చేస్తున్నామని తెలిపారు. వధువు ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అలాగే పెళ్లికి ముందు వేరే ఎవరినైనా ప్రేమించిందా అనే కోణంలోనూ విచారిస్తున్నారు. ఇప్పటి వరకూ ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లభ్యంకాలేదని అధికారులు తెలిపారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు