అనుమానాస్పద స్థితిలో నవ వధువు మృతి

19 Nov, 2018 09:23 IST|Sakshi
మృతి చెందిన రూపవతి (పైల్‌). పక్కన భర్త యువరాజ్‌

చెన్నై, తిరువళ్లూరు: వివాహమైన మూడు నెలలకే నవ వధువు అనుమానస్పద రీతిలో మృతి చెందింది. ఈ ఘటన కాంచీపురం జిల్లాలో చోటుచేసుకుంది. కాంచీపురం జిల్లా చిన్నకంచికి చెందిన నటరాజన్‌ కుమార్తె రూపవతి(29). ఈమెకు తిరువళ్లూరు జిల్లా కడంబత్తూరు యూనియన్‌ సత్తరై గ్రామానికి చెందిన కృష్ణస్వామి నాడార్‌ కుమారుడు యువరాజ్‌తో గత సెప్టెంబర్‌ 12న కాంచీపురంలో వివాహం జరిగింది. యువరాజ్‌ ప్రయివేటు కంపెనీలో ఉద్యోగి. ఈ క్రమంలో గత దీపావశికి యువరాజ్‌ దంపతులు కాంచీపురం వెళ్లారు. వివాహమై మొదటి దీపావళి కావడంతో పెళ్లికొడుకుకు బంగారు నగలు ఇవ్వడం సంప్రదాయం. అయితే రూపవతి తల్లిదండ్రులు యువరాజ్‌కు బంగారు నగలు ఇవ్వలేదని తెలిసింది.

రెండు రోజుల క్రితం రూపవతి తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి దీపావళి కానుకలను వెంటనే తీసుకుని రావాలని చెప్పినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం 4.45 గంటలకు మప్పేడు పోలీసులు ఫోన్‌ చేసి రూపవతి మరణించినట్టు సమాచారం ఇచ్చారు. దీంతో హుటాహుటిన సత్తరైకు వచ్చిన తల్లిదండ్రులు తమ కుమార్తె ఆచూకీ చెప్పాలని కోరారు. ఇందుకు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చిన యువరాజ్‌ బంధువులు మృతదేహం సవితా వైద్యశాల్లో ఉందని, కడుపునొప్పితో ఉందని వైద్యశాలలో చేరిస్తే మృతి చెందిందని సమాధానం ఇచ్చారు. దీంతో సవిత వైద్యశాలకు వెళ్లగా, అప్పటికే మప్పేడు పోలీసులు మృతదేహాన్ని తిరువళ్లూరు వైద్యశాలకు తరలించినట్టు సమాచారం ఇచ్చారు. దీంతో ఆదివారం ఉదయం వైద్యశాల వద్దకు చేరుకున్న యువతి బంధువులు ఆందోళన నిర్వహించారు. తమ కుమార్తె మృతిపై అనుమానం ఉందని న్యాయం చేయాలని కోరుతూ బోరున విలపించారు. ఈ సంఘటనపై మృతురాలి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. వివాహమై మూడు నెలలు పూర్తి కాకుండానే నవ వధువు మృతి చెందిన సంఘటనపై ఆర్డీఓ విచారణ చేపట్టనున్నారు.

మరిన్ని వార్తలు