‘హంద్రీనీవా’లో అక్కాతమ్ముడు గల్లంతు

17 Jan, 2019 13:54 IST|Sakshi
మౌనిక ,వంశీ

కర్నూలు, పత్తికొండ రూరల్‌: దుస్తులు ఉతికేందుకు హంద్రీనీవా కాలువ వద్దకు వెళ్లిన అక్కా, తమ్మడు నీటి ప్రవాహంలో గల్లంతైన ఘటన బుధవారం మండల పరిధిలోని జివరాళ్లమలతండా గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా.. తండాకు చెందిన శివనాయక్, బాలమ్మల కుమార్తె మౌనిక నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో ద్వితీయ సంవత్సరం చదువుతుండగా, కుమారుడు వంశీ రాతన ఆశ్రమ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. శివనాయక్‌ ఏడాది క్రితం మృతిచెందాడు. 

మౌనిక, వంశీ రెండురోజుల క్రితం సంక్రాంతి పండుగకు స్వగ్రామానికి వచ్చారు. ఈ నేపథ్యంలో బుధవారం  దుస్తులు  ఉతికేందుకు హంద్రీనీవా కాలువ వద్దకు వెళ్లారు. దుస్తులు ఉతుకుతుండగా కాలు జారి మౌనిక, వంశీ, మౌనిక స్నేహితురాలు రేణుక ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయారు. అక్కడే ఉన్న కొందరు గట్టిగా కేకలు వేయడంతో పొలాల్లోని రైతులు అక్కడికి చేరుకున్నారు. గ్రామానికి చెందిన లోక్యానాయక్‌ కాలువలోకి దూకి రేణుకను కాపాడాడు. మిగిలిన వారికోసం కొందరు గాలించినా లాభం లేకపోయింది. దీంతో కుటుంబ సభ్యులకు, గ్రామస్తులకు విషయం చేరవేశారు. విషయం తెలుసుకున్న ఫైర్‌ స్టేషన్‌ సిబ్బంది రాత్రి వరకు గాలింపు చర్యలు చేపట్టారు. సీఐ కృష్ణయ్య పోలీసు సిబ్బందితో సంఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. అక్కడే ఉండి గల్లంతైన వారి ఆచూకీ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తు న్నారు. ఈ ఘటనతో పండుగ రోజు గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. 

మరిన్ని వార్తలు