చెల్లి బంగారానికే ఎసరు

22 Feb, 2020 10:21 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న చాంద్రాయణగుట్ట పోలీసులు, స్వాధీనం చేసుకున్న బంగారు నగలు

నిందితుడి అరెస్ట్‌ 11 తులాల బంగారం స్వాధీనం  

చాంద్రాయణగుట్ట: సోదరి బంగారాన్ని కాజేసిన యువకుడిని చాంద్రాయణగుట్ట పోలీసులు అరెస్ట్‌ చేసి శుక్రవారం రిమాండ్‌కు తరలించారు. ఇన్‌స్పెక్టర్‌ రుద్ర భాస్కర్, డీఐ కె.ఎన్‌.ప్రసాద్‌ వర్మతో కలిసి వివరాలు వెల్లడించారు. అల్‌ జుబేల్‌ కాలనీకి చెందిన సయ్యద్‌ యూసుఫ్‌ కుమారుడు సయ్యద్‌ అఫ్జల్‌  వస్త్రాల వ్యాపారం చేసేవాడు. 2019 నవంబర్‌ 5న తన ఇంట్లో జరిగిన శుభకార్యంలో పాల్గొనేందుకు అతడి సోదరి పుట్టింటికి వచ్చింది. అ సమయంలో అతనికి డబ్బులు అవసరం ఉండడంతో అఫ్జల్‌ ఆమెకు సంబంధించిన 11తులాల బంగారు నగలు, ఇంట్లో ఉన్న రూ.50 వేల నగదు తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయాడు. దీంతో కుటుంబసభ్యులు చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

అఫ్జల్‌ నేరుగా గుల్బర్గ వెళ్లి, అక్కడి నుంచి బెంగుళూర్‌కు వెళ్లి రెండు నెలలు గడిపాడు. అగత జనవరిలో నగరానికి వచ్చిన అతను రూ.50 వేలతో వస్త్రాలు కొనుగోలు చేసి నాంపల్లిలోని ఓ లాడ్జిలో దిగాడు. అతడి ఫోన్‌ ఆన్‌ కావడంతో సిగ్నల్స్‌ ఆధారంగా ఏఎస్సై సుధాకర్‌ ఈ నెల 18న అతడిని అదుపులోకి తీసుకుని  కుటుంబ సభ్యులకు అప్పగించాడు. ఈ విషయం తెలియడంతో వారి ఇంటికి వచ్చిన అతడి బావ తమ బంగారం తిరిగి ఇవ్వాలని కోరాడు. అయితే తాను తీసుకోలేదని చెప్పిన అఫ్జట్‌ మరోసారి ఎవరికీ చెప్పకుండా పరారయ్యాడు. దీంతో అతని బావ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరం అంగీకరించాడు. అతడి నుంచి 11 తులాల బంగారు నగలు స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. 

మరిన్ని వార్తలు