సోదరుడు కాదు..ఉన్మాది  

20 Jun, 2019 07:18 IST|Sakshi

సాక్షి, కర్నూలు : దివ్యాంగుడితో పెళ్లికి సిద్ధపడిన సొంత పిన్ని కూతురిపై ఓ కసాయి వ్యక్తి హత్యాయత్నం చేశాడు. కర్నూలు జిల్లా నంద్యాలలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితురాలి తల్లి లక్ష్మిదేవి తెలిపిన వివరాల మేరకు.. నంద్యాలకు చెందిన లక్ష్మిదేవికి, మహానంది మండలం తిమ్మాపురం గ్రామానికి చెందిన అమర్‌నాథ్‌కు 25 ఏళ్ల క్రితం వివాహమైంది. పెళ్లి తర్వాత వీరు విజయవాడకు వెళ్లి అక్కడే కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి ఏకైక కుమార్తె జ్యోతిని విజయవాడలోనే డిగ్రీ వరకు చదివించారు.

ఉన్నత చదువులు చదివించే స్తోమత లేకపోవడంతో కుమార్తెకు వివాహం చేయాలని నిశ్చయించుకున్నారు. కర్నూలు జిల్లా మిడుతూరు మండలం రోళ్లపాడు గ్రామానికి చెందిన సుదర్శన్‌తో వివాహం చేయాలని నిర్ణయించుకుని 20 రోజుల క్రితం నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. సుదర్శన్‌ బాపట్లలోని ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయంలో కాంట్రాక్ట్‌ లెక్చరర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు చిన్నతనంలోనే పోలియో సోకగా, ఒక కాలు, ఒక చేయి సరిగా పనిచేయవు. అయినా ఉన్నత విద్యావంతుడు కావడంతో పెళ్లికి సిద్ధపడ్డారు. అయితే రుద్రవరం మండలం తిప్పారెడ్డిపాలెంలో ఉండే జ్యోతి సొంత పెద్దమ్మ రామలక్ష్మమ్మ కుమారుడు సుబ్బరాయుడికి ఈ సంబంధం నచ్చలేదు.

దివ్యాంగుడితో పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నావంటూ తరచూ ఫోన్‌చేసి బెదిరించేవాడు. ఈ క్రమంలో జ్యోతి తన తల్లితో కలిసి నంద్యాలలోని నూనెపల్లెలో ఉన్న తాత ఇంటికి వచ్చారు. విషయం తెలుసుకున్న సుబ్బరాయుడు వారితో మాట్లాడేందుకు నూనెపల్లెకు చేరుకున్నాడు. పెళ్లి రద్దు చేసుకోవాలని గట్టిగా గద్దించాడు. ఇందుకు తల్లీకూతుళ్లు ససేమిరా అనడంతో జ్యోతిని చంపటానికి సిద్ధపడ్డాడు. ఆమె తల్లి స్నానం చేసేందుకు బాత్‌రూమ్‌లోకి వెళ్లిన వెంటనే కూరగాయలు తరుగుతున్న జ్యోతి చేతిలోని కత్తిని లాక్కుని ఆమె మెడపై పొడిచాడు. బాధితురాలు గట్టిగా కేకలు వేయటంతో సుబ్బరాయుడు అక్కడి నుంచి పరారయ్యాడు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న యువతిని ఆమె తల్లి 108 సహాయంతో నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెడ నరాలు తెగిపోవటంతో వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. జ్యోతి ఫిర్యాదు మేరకు త్రీటౌన్‌ సీఐ సుదర్శన్‌ ప్రసాద్‌ కేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలిస్తున్నారు.

మరిన్ని వార్తలు