కాపలా వెళ్లి.. కాటికి చేరారు

20 Jun, 2020 12:59 IST|Sakshi
తిరుమలేశ్‌ (ఫైల్‌) మహేష్‌ (ఫైల్‌)

బావిలోపడి ఇద్దరు చిన్నారులు మృతి

ఇరువురు అన్నదమ్ముల కుమారులు

రేచినిలో విషాదం

తాండూర్‌ (బెల్లంపల్లి): కాపలాకు వెళ్లిన ఆ చిన్నారులు కాటికి పయనమయ్యారు. ఉడతా భక్తిగా కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉందామనుకున్న ఆ పసికూనలను పంట పొలాల మధ్యలోని బావి హరించింది. దప్పిక తీర్చుకుందామని బావి వద్దకు వెళ్లిన ఆ చిన్నారులు అందులోపడి విగతజీవులుగా మారారు. ఈ హృదయ విదారకర ఘటన స్థానికులను కలిచివేసింది. సరిగ్గా నెల రోజుల క్రితం కన్నెపల్లి మండలం మాడవెల్లి గ్రామ శివారులోని ఒర్రెలో ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన మరవకముందే  రేచిని గ్రామంలో ఈ సంఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ఇరువురు చిన్నారులు ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ముల కుమారులు.

తాండూర్‌ మండలం రేచిని గ్రామానికి చెందిన ముర్కి బీరమ్మ, రాజయ్య దంపతుల పెద్ద కుమారుడు తిరుమలేశ్‌ (14), ముర్కి పోసక్క, శంకర్‌ దంపతులకు నలుగురు సంతానం. అందులో చిన్న కుమారుడు మహేష్‌ (10),  గ్రామ శివారులోని పంట పొలాల్లో గొర్రెల మంద ఉంచిన శంకర్‌  గురువారం గొర్రెలను, మేకలను అడవికి మేతకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో గొర్రె పిల్లలకు కాపలగా తిరుమలేశ్, మహేష్‌లను ఉంచి వెళ్లాడు. సాయంత్రం తిరిగి వచ్చే వరకు గొర్రె పిల్లల వద్ద తిరుమలేశ్, మహేష్‌ ఇద్దరు కనబడ లేదు. దీంతో ఇంటికి వెళ్లి ఉంటారని అనుకుని రాత్రి వరకు రేచిని గ్రామంలో వెతికారు. ఎక్కడా ఆ ఇద్దరి ఆచూకీ కానరాకపోవడంతో గొర్రెల మంద ఉంచిన చుట్టు ప్రక్కల ప్రాంతంలో వెతికారు. పూడిక తీసిన వ్యవసాయ బావి వద్ద సదరు చిన్నారుల చెప్పులను గుర్తించారు.  శుక్రవారం ఉదయం  సీఐ సామల ఉపేందర్, ఎస్సై శేఖర్‌రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను బావిలో నుంచి బయటకు తీయించారు. చిన్నారులు సొంత అన్నదమ్ముల కుమారులు.

తాగునీటి కోసం వెళ్లి..
గొర్రె పిల్లలకు కాపలగా ఉన్న ఆ చిన్నారులిద్దరు దాహం వేయడంతో సమీపంలోని బావి వద్దకు  మంచినీళ్ల కోసం వెళ్లారు. ప్రమాదవశాత్తు బావిలో జారిపడి నీటమునిగి మృతి చెంది ఉంటారని పోలీసులు అంచనా వేశారు. చిన్నారులు ప్రమాదవశాత్తు మృతి చెంది ఉంటారని సీఐ తెలిపారు.

అండగా ఉంటాడనుకుంటే..
ముర్కి బీరమ్మ – రాజయ్యలకు తిరుమలేశ్, సిద్ధార్థలు ఇద్దరు కుమారులు. రాజయ్య మొదటి నుంచి అంగవైకల్యంతో బాధపడుతున్నాడు. ఐదు సంవత్సరాల క్రితం మంచానికే పరిమితమయ్యాడు. తిరుమలేశ్‌కు ఎనిమిదేళ్ల  వయస్సులోనే తల్లి బీరమ్మ తండ్రితో విడాకులు తీçసుకుని వెళ్లిపోయింది. దీంతో చిన్నారులిద్దరి నానమ్మ తాతయ్య  ముర్కి మల్లక్క, రాజమల్లు వద్ద ఉంటున్నారు. తిరుమలేశ్‌ మంచిర్యాలలోని గురుకుల పాఠశాలలో ఎనిమిదో తరగతి పూర్తి చేశాడు. లాక్‌డౌన్‌తో ఇంటికి వచ్చి ప్రమాదవశాత్తు మృత్యువాత పడడంతో ఆ కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

అల్లారుముద్దుగా పెంచుకున్న కొడుకా.
ముర్కి పోసక్క– శంకర్‌లకు నలుగురు సంతానం. ముగ్గురు ఆడ ఒకడే కుమారుడు. చిన్నవాడైన మహేష్‌ను అల్లారుముద్దుగా పెంచుకున్నారు. మహేష్‌ స్థానిక రేచిని పాఠశాలలో ఆరో తరగతి పూర్తి చేశాడు. ఒక్కగానొక్క కొడుకు ప్రమాదవశాత్తు బావిలో పడి  చనిపోవడంతో ఆ కుటుంబంలో కారుచీకట్లు కమ్ముకున్నాయి.

మరిన్ని వార్తలు