తమ్ముడిని రక్షించి ప్రాణం విడిచిన అన్న

13 Nov, 2019 07:39 IST|Sakshi
అరుణ్, రంజిత్‌ (ఫైల్‌)

మురికి ట్యాంక్‌ శుభ్రం చేస్తుండగా వెలువడిన విషవాయువు

ప్రైవేటు మాల్‌లో ఘటన

సాక్షి, చెన్నై : విషవాయువు పీల్చి ట్యాంక్‌లో స్పృహ తప్పి పడి ఉన్న తమ్ముడ్ని రక్షించి ఓ అన్న మృత్యుఒడిలోకి చేరాడు. మంగళవారం రాయపేటలోని ఓ ప్రైవేటు మాల్‌లో మురికి నీటి ట్యాంక్‌ శుభ్రం చేస్తుండగా ఈ విషాదం చోటుచేసుకుంది. 

తమ్ముడి కోసం అన్న..
చెన్నై ఐస్‌ హౌస్‌ హనుమంతపురానికి చెందిన మూర్తికి అరుణ్‌కుమార్‌(25), రంజిత్‌కుమార్‌(23) కుమారులు. అన్నదమ్ముళ్లు ఇద్దరూ తమకు ఏ పని దొరికినా సరే, దాన్ని పూర్తి చేసి కుటుంబానికి అండగా ఉంటూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రాయపేటలోని ఓ ప్రైవేటు మాల్స్‌లో అండర్‌ గ్రౌండ్‌లో ఉన్న మురికి నీటి తొట్టెను శుభ్రం చేసే పని లభించింది. తమ ప్రాంతానికి చెందిన దండపాణి అనే వ్యక్తి ద్వారా లభించిన ఈ పనిని చేయడానికి రంజిత్, అరుణ్‌కుమార్‌తో పాటుగా మరో ముగ్గురు ఉదయం వెళ్లారు. తొలుత రంజిత్‌ కుమార్‌తో పాటుగా, మరో యువకుడు మురికి నీటి ట్యాంక్‌లోకి వెళ్లి శుభ్రం చేయడం మొదలెట్టారు. ఈ సమయంలో విషవాయువు వెలువడడంతో ఓ యువకుడు భయంతో బయటకు వచ్చేశాడు. అయితే, రంజిత్‌కుమార్‌ బయటకు రాలేని పరిస్థితి. దీంతో ఆందోళన చెందిన అన్న అరుణ్‌కుమార్‌ తమ్ముడ్ని రక్షించేందుకు ఆ ట్యాంక్‌లోకి వెళ్లాడు. స్పృహ తప్పి పడి ఉన్న తమ్ముడ్ని అతి కష్టం మీద రక్షించి బయటకు పంపించాడు. అయితే, ఆ విషవాయువు తనను కూడా తాకడంతో క్షణాల్లో ఆ మురికి నీటి ట్యాంక్‌లో కుప్పకూలాడు. మిగిలిన వారు పెట్టిన కేకతో మాల్‌ భద్రతా సిబ్బంది పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అన్నా సాలై పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అరుణ్‌కుమార్‌ను బయటకు తీసుకొచ్చి, ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మరణించినట్టు వైద్యులు తేల్చారు. రంజిత్‌కుమార్‌ ప్రథమ చికిత్స అనంతరం కోలుకున్నాడు.

నిర్వాహకుల నిర్లక్ష్యమే కారణం..
తనను రక్షించి అన్న అరుణ్‌కుమార్‌ మరణించడంతో రంజిత్‌ కన్నీరు మున్నీరు అయ్యాడు. తన సోదరుడి మృతికి మాల్‌ నిర్వాహకులే కారణమని మండిపడ్డాడు. ట్యాంకును సేఫ్టీ బృందం పరిశీలించినట్టు, అందులోకి వెళ్లవద్దని సూచించినా, ఆ విషయం తమకు చెప్పలేదని ఆరోపించాడు. విషయం తెలియకుండా లోపలికి వెళ్లిన కాసేపటికి ఏం జరిగిందో తెలియని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశాడు. తన సోదరుడిని కోల్పాయానని విలపించాడు. అరుణ్‌ కుమార్‌ మరణ సమాచారంతో మూర్తి కుటుంబం శోక సంద్రంలో మునిగింది. ఐస్‌ హౌస్‌ పరిసర వాసులు పెద్ద సంఖ్యలో రాయపేట ఆస్పత్రి వద్దకు చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. కేసు నమోదు చేసిన అన్నా సాలై పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబీకులకు అప్పగించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చుస్తున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా