అక్కను చంపిన తమ్ముడు

10 Aug, 2019 09:17 IST|Sakshi
శ్వేతలక్ష్మి (ఫైల్‌)

చందానగర్‌: తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలు తీసుకురమ్మని ఒత్తిడి చేయడంతో వరుసకు అక్కను ఉరి వేసి హత్య చేసిన ఓ నిందితుడిని చందానగర్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. చందానగర్‌ ఇన్‌స్పెక్టర్‌ రవీందర్‌ తెలిపిన మేరకు.. శేరిలింగంపల్లిలోని పాపిరెడ్డి కాలనీ, సురభీకాలనీకి చెందిన ఆర్‌. రమణరావు (36) లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అదే కాలనీలో నివాసముంటున్న ఆర్‌. శ్వేతలక్ష్మి (42) విడాకులు తీసుకొని పాపిరెడ్డి కాలనీలో నివసిస్తోంది.  శ్వేతలక్ష్మి చిన్ననాన్న కుమారుడు రమణరావు మద్యానికి బానిసై ఇద్దరూ కలిసి ప్రతిరోజు మద్యం సేవిస్తూ ఉండేవారు. శ్వేతలక్ష్మీ వద్ద ఉన్న డబ్బు ఖర్చుచేయడంతోపాటు ఆమె ఆభరణాలు రమణరావు తాకట్టు పెట్టి మద్యం సేవించారు. ఈ క్రమంలో ఈ నెల 4న రాత్రి ఇద్దరు కలిసి మద్యం తాగుతున్న సమయంలో ఇద్దరికి బంగారం విషయంలో గొడవ జరిగింది. తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించు తీసుకురావాలని రమణరావును ఒత్తిడి చేసింది.

దీంతో రమణరావు ఆమెను కొట్టగా తల గోడకు తగిలి మూర్చబోయింది. అప్పుడే రమణరావు పక్కనే ఉన్న చీరతో ఆమె గొంతుకు చున్నీచుట్టి హత్య చేసి అనంతరం ఆమెనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు సృష్టించి వెళ్లిపోయాడు. అదే కాలనీలో శ్వేతలక్ష్మి సోదరుడు ఆర్‌. శివకుమార్‌ నివాసముంటున్నాడు.  శివకుమార్‌ అక్కడికి చేరుకొని చూసి పోలీసులకు సమాచారం అందించారు.  పోలీసులు హుటహూటీన సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఆమె మృతిపై అనుమానాలు రావడంతో అనుమానస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ కొనసాగించారు. పోస్టుమార్టం రిపోర్ట్‌ ఆ«ధారంగా శ్వేతలక్ష్మి గొంతుకు చీరతో బిగించి ఉరి వేసినట్లు నిర్ధారణ అయ్యింది. అనుమానితుడైన ఆర్‌. రమణరావును అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని అంగీకరించాడు. రమణరావు తాకట్టు పెట్టిన బంగారం, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. దీంతో పోలీసులు అతని పై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. 

మరిన్ని వార్తలు