అన్నను చంపిన తమ్ముడు

16 Jul, 2018 12:51 IST|Sakshi

ఆస్తి వివాదమే కారణం

కురిచేడు: ఆస్తి వివాదంతో అన్నను తమ్ముడు చంపిన సంఘటన మండలంలోని ఆవులమంద పంచాయతీ ప్రతిజ్ఞాపురి కాలనీలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం కాలనీకి చెందిన చలమాల వెంకటేశ్వర్లు(40)ను ఆయన తమ్ముడు చెంచారావు బరిసెతో దాడి చేయగా వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందాడు. అంగన్‌వాడీ కార్యకర్త చలమాల అల్లూరమ్మకు ముగ్గురు కుమారులు. ఆమెకు సుమారు 10 ఎకరాల సాగు భూమి ఉంది. అయితే ముగ్గురు కుమారులకు మూడు ఎకరాల ప్రకారం పంపిణీ చేసింది.

మిగతా ఎకరం అల్లూరమ్మకు కేటాయించారు. అయితే అల్లూరమ్మను చిన్న కుమారుడు చెంచారావు పోషిస్తున్నాడు. అల్లూరమ్మ పెద్ద కుమారుడు ఇంటి పక్కనే ఉండటం వలన చిన్న చిన్న అవసరాలకు పెద్ద కుమారుడు వెంకటేశ్వర్లు డబ్బు సర్దుతున్నాడు. ఈ నేపథ్యంలో వెంకటేశ్వర్లు అవసరం కోసం తల్లి బంగారు ఆభరణాలు తనఖా పెట్టి డబ్బు తెచ్చుకున్నాడు. అవి తనకు ఇవ్వాలని, తల్లి పేరున ఉన్న ఎకరం భూమి కూడా తనకే చెందాలని ఇరువురు అన్నదమ్ముల మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో చెంచారావు బరిసెతో వెంకటేశ్వర్లుపై దాడి చేయటంతో వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్సై బి.ఫణిభూషణ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.

మరిన్ని వార్తలు