కలిసి వెళ్లారు.. కన్నుమూశారు

12 Jan, 2019 13:32 IST|Sakshi
సుండుపల్లె ఆరోగ్యకేంద్రంలో రఫీక్‌ మృతదేహం

బైకును ఢీ కొన్న ఆర్టీసీ అద్దెబస్సు

అన్నదమ్ముల దుర్మరణం

ప్రమాద స్థలాన్ని సందర్శించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీలు

రాయవరంలో విషాదం

వైఎస్‌ఆర్‌ జిల్లా, సుండుపల్లె : సుండుపల్లె–రాయవరం రహదారిలో జరిగిన రోడ్డుప్రమాదంలో అన్నదమ్ములు దుర్మరణం చెందారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని రాయవరానికి చెందిన సిద్దిక్‌ కుమారులు మహ్మద్‌ రఫీక్‌ (45) అతని సోదరుడు ఇలియాస్‌ (42) శుక్రవారం ఉదయం రాయవరం నుంచి సుండుపల్లెకు తమ ద్విచక్రవాహనంపై బయలుదేరారు. మార్గమధ్యంలో రాయవరం క్రాస్‌ మడితాడు మధ్యలోని మలుపులో రాయచోటి నుంచి పింఛాకు వెళుతున్న ఆర్టీసీ బస్సు ఢీ కొంది.

ఈ ప్రమాదంలో అన్నదమ్ములిద్దరి తలలకు బలమైన గాయాలు తగిలి ఇలియాస్‌ (42) అక్కడికక్కడే మృతి చెందగా మహమ్మద్‌ రఫీక్‌ (45)ను స్థానికులు ఆటోలో చికిత్స నిమిత్తం  సుండుపల్లె ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రమాదంలో సోదరులను మృత్యువు కబళించిన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు సంఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించారు. ప్రమాదంలో ద్విచక్రవాహనం పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. మృతులు మహ్మద్‌ రఫీక్‌కు భార్య కుమారుడు, కుమార్తె,  ఇలియాస్‌కు భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న వెంటనే ఎస్‌ఐ నరసింహారెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించారు.

విషాదంలో రాయవరం :ఇంట్లోనుంచి బయలుదేరిన అయిదు నిమిషాల్లోనే జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములిద్దరూ మృత్యువాత పడటంతో మృతుల స్వగ్రామం రాయవరంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల పరామర్శ :సుండుపల్లె మండల పర్యటనలో ఉన్న రాజంపేట ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ మేడా మల్లికార్జునరెడ్డి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డిలు వెంటనే ప్రమాదస్థలాన్ని సందర్శించారు. మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ సందర్భంగా మృతుల అంత్యక్రియలకు ప్రభుత్వవిప్‌ మేడా మల్లికార్జునరెడ్డి రూ.10వేలు అందజేశారు. ప్రమాదస్థలాన్ని వైఎస్సార్‌సీపీ నాయకుడు కరీంబాషా తదితరులు సందర్శించారు.

మరిన్ని వార్తలు