పెళ్లింట విషాదం!

2 May, 2019 11:28 IST|Sakshi
విలపిస్తున్న బంధువులు మృతులు బాలరాజు, దిలీప్‌

విద్యుదాఘాతంతో తోడల్లుళ్లు మృతి

కరెంట్‌ స్తంభం పాతుతుండగా ఘటన

అధికారుల నిర్లక్ష్యమే కారణమని మృతుల బంధువుల ఆరోపణ

ఆ ఇంట్లో నాలుగు రోజుల క్రితం వివాహ వేడుక ఘనంగా జరిగింది. సోమవారం తిరుగు పెళ్లి కూడా బంధుమిత్రుల ఆనందోత్సాహాల మధ్య సాగింది. అంతలోనే పెళ్లి వేడుకలో విషాదం. విద్యుత్‌ స్తంభం రూపంలో మృత్యువు తోడల్లుళ్లను కబళించింది. పెళ్లింట రోదనలు మిన్నంటాయి. ఈ దుర్ఘటన బుధవారం ఆదోని మండలం కపటి గ్రామంలో చోటు చేసుకుంది.

ఆదోని: పట్టణంలోని రాయనగర్‌కు చెందిన దిలీప్, కపటి గ్రామానికి చెందిన బాలరాజు తోడల్లుళ్లు. కపటిలో ఆదివారం జరిగిన బావమరిది సురేష్‌ పెళ్లిలో అంతా తామై వ్యవహరించారు. బావ మరిది పెళ్లి ఘనంగా చేశారు. మరుసటి రోజు సోమవారం వధువు ఇంట కోసిగిలో తిరుగు పెళ్లిని కూడా ముగించుకుని అదే రోజు రాత్రి తిరిగి కపటికి చేరుకున్నారు. బుధవారం..బావమరిది ఇంటికి సమీపంలో విద్యుత్‌ స్తంభం పాతేందుకు సిద్ధం అయ్యారు. తాళ్ల సాయంతో కొందరు స్తంభాన్ని పైకి లేపి నిలబెట్టగా బాలరాజు, దిలీప్‌ గడ్డపారతో దానిని గుంతలోకి నెడుతున్నారు. అయితే పైన ఓ సెల్‌ టవర్‌ కోసం లాగిన విద్యుత్‌ లైన్‌ స్తంభానికి తాకి.. ఇనుప చువ్వల ద్వారా విద్యుత్తు ప్రవహించింది. దీంతో గడ్డపార పట్టుకున్న బాలరాజు, దిలీప్‌ గిలగిల కొట్టుకుంటూ కింద పడిపోయారు. మిగతా వారు గమనించి స్తంభాన్ని నేలమీద పడేసి...బాలరాజు(28), దిలీప్‌(30)ని  దూరంగా లాగి, వెంటనే ఆటోలో ఆదోని పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. మృతదేహాలను ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. బాలరాజుకు భార్య ఏసుకుమారి, ఇద్దరు పిల్లలు, దిలీప్‌కు భార్య ఎలంగిమాత, ఇద్దరు పిల్లలు ఉన్నారు.  

విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యమేనా?
విద్యుత్‌ లేన్‌ తమ ఇంటికి దూరంగా ఉందని, తమ ఇంటికి సమీపంలోనే మరో స్తంభం ఏర్పాటు చేయాలని చాలా సార్లు విద్యుత్తు అధికారులు, సిబ్బందికి సురేష్‌ విన్నవించుకున్నారు. అయితే ఎవరూ సానుకూలంగా స్పందించలేదు. గాలి, వాన సమయంలో సర్వీసు వైరు తెగి పడితే ప్రమాదాలు చోటు చేసుకోవచ్చని భయపడిన సురేష్‌ కుటుంబ సభ్యులు ఎక్కడో వృథాగా పడి ఉన్న పాత విద్యుత్తు స్తంభాన్ని తీసుకు వచ్చి ఇంటి వద్ద వేసుకున్నారు. స్వంతంగా అయినా దానిని ఏర్పాటు చేసుకోవానుకున్నట్లు తెలుస్తోంది. సరైన అవగాహన లేక పోవడంతో సిమెంట్‌ పెచ్చులూడి, ఇనుప చువ్వలు తేలిన స్తంభాన్ని పాతేందుకు చేసిన ప్రయత్నంలోనే రెండు నిండు ప్రాణాలు బలి అయ్యాయి.  అధికారులు స్పందించి ఉంటే రెండు నిండు ప్రాణాలు బలి అయ్యేవి కాదని గ్రామ మాజీ సర్పంచ్‌ రాజు, మృతుల బంధువు చిన్నప్ప, గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఘటనకు విద్యుత్‌ అధికారులే బాధ్యత వహించి మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని కోరారు.

మా నిర్లక్ష్యం లేదు
కపటి ఘటనకు విద్యుత్‌ అధికారుల నిర్లక్ష్యం కారణంగా చెప్పడం అన్యాయం. ఇంటి వద్ద విద్యుత్‌ స్తంభం అవసరాన్ని మా దృష్టికి తీసుకు రాలేదు. సిబ్బందికి చెప్పారో లేదో నాకు తెలియదు. సిబ్బంది సానుకూలంగా స్పందించకుంటే ఏఈ, ఏడీఈ, డీఈ దృష్టికి తీసుకురావాలి. ఎక్కడో తెచ్చుకున్న స్తంభాన్ని స్వంతంగా పాతుకోకూడదు. కనీసం మా దృష్టికి తెచ్చినా ప్రమాదం చోటు చేసుకోకుండా  జాగ్రత్తలు తీసుకునేందుకు అవకాశం ఉండేది. ఏ మాత్రం అవకాశం ఉన్నా ఆర్థిక సాయం అందిస్తాం. ఈ విషయమై ఉన్నత స్థాయిలోనే అ«ధికారులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.–ఖలీల్‌ బాబు, ఆదోని ఏడీఈ   

మరిన్ని వార్తలు