రియల్టర్‌ను హతమార్చిన అన్నదమ్ములు

17 Dec, 2019 08:44 IST|Sakshi

అందరూ చూస్తుండగానే ఘాతుకం

మంటగలిసిన మానవత్వం

అడ్డుకోవాల్సింది పోయి సెల్‌లో చిత్రీకరణ

సాక్షి, ఆదిలాబాద్‌: రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారంలో తగాదాల కారణంగా ఓ ప్రాణం బలైంది. ఇద్దరు అన్నదమ్ములు కలిసి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి అమూల్‌పై కత్తులతో దాడిచేసి హతమర్చారు. ఆదిలాబాద్‌ జిల్లాకేంద్రంలోని నడిరోడ్డుపై రాత్రి సమయంలో ఈ దారుణం చోటుచేసుకుంది. అందరూ చూస్తుండగానే కత్తులతో మెడకోసి ప్రాణం తీశారు. రక్తం మడుగులో కాపాడండి అంటూ వేడుకున్నప్పటికీ చుట్టుపక్కల ఉన్నవారు సాహసించలేదు. గొంతు కోయడంతో అమూల్‌ రక్తంతో తడిసిపోయాడు. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న ఆయనను చికిత్స నిమిత్తం పోలీసులు జిల్లాకేంద్రంలోని రిమ్స్‌కు తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందిస్తున్న సమయంలో తుది శ్వాస వదిలాడు. బేల మండల కేంద్రానికి చెందిన అమూల్‌ కొమ్మావార్‌ (40) గత కొన్నేళ్లుగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తున్నాడు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో బేల సర్పంచ్‌గా అభ్యర్థిగా పోటీ చేసి పరాజయం పాలయ్యాడు. ఈయనకు భార్య వైశాలి, కూతురు రియా ఉన్నారు. కూతురు ఇంటర్‌ పూర్తి చేసి ఎంబీబీఎస్‌ కోసం నీట్‌ శిక్షణ పొందుతుంది. కాగా అమూల్‌ను ఆదిలాబాద్‌ పట్టణంలోని తాటిగూడకు చెందిన దిలీప్‌సింగ్‌ షెకావత్, గోపాల్‌సింగ్‌ షెకావత్‌ అన్నదమ్ములు అమూల్‌తో పాటు రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం చేసేవారని వారే కత్తులతో దాడిచేసి అమూల్‌ను హత్య చేసినట్లు డీఎస్పీ వెంకటేశ్వర్లు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి పట్టణంలోని వన్‌టౌన్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ముగ్గురు కలిసి ఆయా మండలాల్లో ప్లాట్లు విక్రయించారు. దిలీప్‌సింగ్, గోపాల్‌సింగ్‌లు పలువురికి ప్లాట్లు ఇప్పించారు. వీరు ఇప్పించిన ప్లాట్లకు అమూల్‌ రెండేసి రిజిస్ట్రేషన్లు చేయించాడు. దీంతో ప్లాట్లు తమకొద్దని, తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని ఇద్దరు అన్నదమ్ముల్ని కస్టమర్లు ఇబ్బందులకు గురిచేసే వారని తెలిపారు. అమూల్‌కు విన్నవించినా రేపుమాపు అంటూ కాలం గడుపుతుండడం.. తగాదాల కారణంగా ప్లాట్లు కొనుగోలు చేసిన వారు తరచూ డబ్బుల కోసం ఇంటి వద్ద చక్కర్లు కొడుతుండడంతో దిలీప్‌సింగ్, గోపాల్‌సింగ్‌ తండ్రి అనారోగ్యానికి గురై మంచానికి పరిమితమైనట్లు పేర్కొన్నారు. ఈ బాధను తట్టుకోలేక అన్నదమ్ములిద్దరు ఈ ఘటనకు ఒడిగట్టారు.

కొట్టుమిట్టాడుతున్నా.. వీడియో చిత్రీకరణ
రోజురోజుకు మానవత్వం మంట కలుగుతున్నదనడానికి ఈ ఘటనే నిదర్శనం. జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌ ఎదుట జాతీయ రహదారిపై అన్నదమ్ములిద్దరు కలిసి ఓ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి గొంతును కోసి కత్తులతో పొడిచినప్పటికీ చుట్టుపక్కల ఉన్నవారు ఏదో సినిమా షూటింగ్‌ నడుస్తున్నట్లు చూశారు. ఆ దృశ్యాలను వీడియో తీస్తున్నారే తప్పా కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ కాపాడాలని వేడుకున్నప్పటికీ కనీసం ఆస్పత్రికి తరలించిన పాపాన పోలేదు. ఒకవేళ సరైన సమయంలో ఆస్పత్రికి తరలించి వైద్యం అంది ఉంటే ప్రాణాలతో బయటపడేవాడని పలువురు చర్చించుకున్నారు. పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి తీసుకెళ్లేంత వరకు సెల్‌ఫోన్‌లలో వీడియోలు తీసి సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేయడమే తప్పా ఆయనను బతికించాలనే సాహసం చేయలేకపోయారు. 

మరిన్ని వార్తలు