అక్క ఆస్తి కబ్జాకు తమ్ముళ్ల కుట్ర

24 Jul, 2019 10:47 IST|Sakshi
సర్వేష్‌ యాదవ్‌, నాగసాయి యాదవ్‌

తల్లి, చెల్లి సహకారం

నలుగురు దోషులకు జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పు   

సాక్షి,సిటీబ్యూరో :  ఆస్తి కోసం అమ్మను వేధించిన కుమారుడు, కోడలికి రెండేళ్ల జైలు శిక్ష పడిన 24 గంటల్లోనే.. అక్కను వంచించిన తమ్ముళ్లకు న్యాయస్థానం శిక్ష విధించింది. తన సోదరి పేరిట ఉన్న స్థిరాస్తిని కబ్జా చేయడానికి వీరిద్దరూ ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించారు. ఇందుకు వారి తల్లి, చెల్లి సహకరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు 2015లో కేసు నమోదు చేసిన పోలీసులు అప్పట్లోనే నలుగురు నిందితులనూ అరెస్టు చేసి వారిపై మల్కాజ్‌గిరి కోర్డులో అభియోగపత్రాలు దాఖలు చేశారు. దీనిని విచారించిన న్యాయస్థానం అన్నదమ్ములతో పాటు తల్లి, చెల్లినీ దోషులుగా నిర్థారించింది. వీరికి శిక్షలు విధిస్తూ మంగళవారం తీర్పు చెప్పింది. తల్లిని వేధించిన కేసు, సోదరిని వంచించిన కేసు.. ఈ రెండూ రాచకొండ పరిధిలోని నేరేడ్‌మెట్‌ ఠాణాకు సంబంధించినవే కావడం, ఈ రెండింటిలోనూ మల్కాజ్‌గిరి 19వ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు తీర్పునివ్వడం గమనార్హం.

వివరాల్లోకి వెళితే.. నేరేడ్‌మెట్‌లోని కాకతీయనగర్‌కు చెందిన  అరుణ జ్యోతి వివాహిత. ఈమెకు తల్లి వంగూరు కళావతి, ఇద్దరు సోదరులు సర్వేష్‌ యాదవ్, నాగసాయి యాదవ్‌తో పాటు సోదరి శ్రీదేవి ఉన్నారు. అరుణ తండ్రి లక్ష్మీనారాయణ 1986లో వినోభానగర్‌లో 160 చదరపు గజాల స్థలాన్ని ఆమె పేరుతో ఖరీదు చేసి, అందులో నాలుగు దుకాణాలు నిర్మించారు. వివాహానంతరం తన భర్తతో వెళ్లిపోయిన అరుణ జ్యోతి ఆ స్థిరాస్తికి సంబంధించిన ఒరిజినల్‌ డాక్యుమెంట్స్‌ మాత్రం పుట్టింటిలోనే వదిలేసింది. ఆ ఆస్తిని ఆధీనంలోకి తీసుకున్న కళావతి, సర్వేష్, నాగసాయి, శ్రీదేవి అక్కడే నివసిస్తున్నారు. దానిని కబ్జా చేయాలని పథకం వేసిన నర్వేష్‌ నకిలీ పత్రాలు సృష్టించి తన సోదరుడు నాగసాయికి బహూకరిస్తున్నట్లు రికార్డులు రూపొందించాడు. వీటిపై తల్లి కళావతి, సోదరి శ్రీదేవి సాక్షులుగా సంతకాలు చేశారు. ఈ విషయం తెలుసుకున్న అరుణ జ్యోతి తన స్థిరాస్తికి సంబంధించిన  ఒరిజినల్‌ డాక్యుమెంట్లు ఇవ్వాల్సిందిగా తల్లి కళావతిని కోరింది. దీనికి ఆమె తిరస్కరించడంతో పాటు కుమారులు, కుమార్తెతో కలిసి అరుణను తీవ్రస్థాయిలో బెదిరించారు. దీంతో 2015 మార్చి 11న బాధితురాలు నేరేడ్‌మెట్‌ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫోర్జరీ జరిగినట్లు నిర్థారించి నలుగురు నిందితులనూ అరెస్టు చేశారు. దర్యాప్తు పూర్తి చేసిన నేరేడ్‌మెట్‌ అధికారులు నిందితులపై మల్కాజ్‌గిరి కోర్టులో అభియోగపత్రాలు దాఖలు చేశారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం నలుగురు నిందితుల్నీ దోషులుగా నిర్థారించింది. వీరిలో సర్వేష్, శ్రీదేవిలకు మూడేళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా, కళావతి, నాగసాయిలకు ఏడాది జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ మంగళవారం తీర్పు ఇచ్చింది. ఈ కేసును సమర్థంగా దర్యాప్తు చేసిన అధికారులను రాచకొండ పోలీసు కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ ప్రత్యేకంగా అభినందించారు. 

మరిన్ని వార్తలు