దంపతుల దారుణహత్య 

22 Jun, 2019 13:02 IST|Sakshi
వివరాలు తెలుసుకుంటున్న ఎస్పీ మల్లారెడ్డి  

సాక్షి, వాంకిడి(ఆసిఫాబాద్‌) : భూ తగాదా దంపతుల దారుణహత్యకు దారితీసిన సంఘటన మండలంలోని ఖిర్డీ గ్రామశివారులో శుక్రవారం చోటు చేసుకుంది. ఖిర్డీ గ్రామ శివారులో సర్వే నం.71లో తొమ్మిది ఎకరాల భూమి విషయమై శుక్రవారం రెండు కుటుంబాల మధ్య జరిగిన తగాద హత్యకు దారి తీసింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రాయిసిడాం శ్యాంరావు నానమ్మ మారుబాయి పేరుతో ఖిర్డీ శివారులో సర్వే నం.71లో తొమ్మిది ఎకరాల భూమి ఉంది. అట్టి భూమిని ఇన్నాళ్లు రాయిసిడాం మారుబాయి కూతురి కుమారులు  తెలంగ్‌రావు కుటుంబ సభ్యులు కౌలుకు ఇస్తూ అనుభవిస్తూ వస్తున్నారు. అట్టి భూమి శ్యాంరావు నానమ్మ పేరున ఉండడంతో తాతల సంతతీ మనుమలకు చెల్లుతుందని శుక్రవారం శ్యాంరావు అతని భార్యతో కలిసి అదే చేనులో పనులకు వెళ్లాడు.

విషయం తెలుకున్న సెడ్మక తెలంగ్‌రావుతో పాటు కుటుంబ సభ్యులైన శారద, బోజ్జిరావు, జంగుబాయి, యశ్వంత్‌రావు, గంగారాం శ్యాంరావు వద్దకు వెళ్లారు. ఈభూమి మాది.. నువ్వెలా చేస్తావని అతనితో వాదనకు దిగారు. ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ పెరగడంతో తెలంగ్‌రావు కుటుంబ సభ్యులు శ్యాంరావు దంపతులపై గొడ్డిలితో దాడిచేయడంతో సంఘటన స్థలంలోనే మృతి చెందారు. విషయం తెలుసుకున్న వాంకిడి ఎస్పై చంద్రశేఖర్, ఆసిఫాబాద్‌ సీఐ రాజు, డీఎస్పీ సత్యనారాయణ సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఎస్పీ మల్లారెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించి హత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. 

పథకం ప్రకారం హతమార్చారు 
రాయిసిడాం శ్యాంరావు నానమ్మ అయిన మారుబాయి పేరుమీద ఉన్న భూమిని మనుమడైన రాయిసిడాం శ్యాంరావుకు చెందుతుందని, అట్టి భూమిలో సేద్యం చేయడానికి శుక్రవారం శ్యాంరావు, అతని భార్య తారాబాయితో కలిసి చేను పనులకు వెల్లారు. విషయం తెలుసుకున్న తెలంగ్‌రావు కుటుంబసభ్యులతో వచ్చి తగాదాకు దిగాడు. మాటామాట పెరగడంతో పధకం ప్రకారం గొడ్డలితో దాడిచేసి హతమార్చారని శ్యాంరావు కుమారులు రాజు, విలాస్, కూతురు నీల ఆరోపించారు. గతంలో సైతం భూతగాదాల విషయం పోలీసులకు విన్నవించినా పట్టించుకోలేదని వారు ఆరోపించారు. అట్టి తగాదాలే హత్యకు దారితీశాయని, హత్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. దంపతుల పెద్ద కుమారుడు రాయిసిడాం విలాస్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ సత్యనారాయణ తెలిపారు.    

మరిన్ని వార్తలు