టీఆర్‌ఎస్‌ నాయకుడి దారుణ హత్య

16 Feb, 2020 02:55 IST|Sakshi

తల్వార్లు, కర్రలు, రాళ్లతో దాడిచేసిన దుండగులు 

అక్కడికక్కడే మృతి చెందిన మాజీ సర్పంచ్‌ ఒంటెద్దు వెంకన్న  

కాంగ్రెస్‌ పార్టీ నేతలే చంపారన్న మృతుడి భార్య, బంధువులు  

సూర్యాపేట జిల్లాలో ఘటన  

సూర్యాపేట రూరల్‌: సూర్యాపేట జిల్లాలోని సూర్యాపేట మండలం యర్కారం గ్రామ మాజీ సర్పంచ్, టీఆర్‌ఎస్‌ నాయకుడు ఒంటెద్దు వెంకన్నయాదవ్‌ (39) దారుణ హత్యకు గురయ్యారు. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సహకార సంఘం ఎన్నికల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం ఓటర్లను కలుసుకునేందుకు వెంకన్నయాదవ్‌తో పాటు, అతని ప్రత్యర్థి వర్గానికి చెందిన కాంగ్రెస్‌ నాయకుడు వడ్డే ఎల్లయ్య అనుచరులు గ్రా మంలో తిరిగారు. ఈ సందర్భంగా ఓటర్లుగా ఉన్న చింతలపాటి ఉపేందర్, చింతలపాటి జయరాజును కలిసేందుకు వెంకన్నయాదవ్‌ తన అనుచరులైన చింతలపాటి మధు, బొడ్డు కిరణ్, గుండ్లపల్లి నవీన్, ఆవుదొడ్డి ప్రవీణ్‌తో కలసి వెళ్లారు. అనంతరం అర్ధరాత్రి దాటిన తర్వాత మార్గమధ్యలో ఎదురుపడ్డ ఇరు పార్టీలు నేతలు, అనుచరులు వాగ్వాదానికి దిగారు.

20 నిమిషాల తరువాత శనివారం తెల్లవారు జామున 2 గంటల ప్రాంతంలో వెంకన్నయాదవ్‌ను వడ్డే ఎల్లయ్యతో పాటు అతని అనుచరులు 15 మందికి పైగా వెంబడించారు. దీంతో వెంకన్నయాదవ్, చింతలపాటి మధు, ఆవుదొడ్డి ప్రవీణ్‌ పరుగెత్తి గ్రామంలోని ఆవుదొడ్డి వీరయ్య ఇంటి తలుపులు నెట్టుకొని ఓ గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. వీరి వెంట ఉన్న బొడ్డు కిరణ్, గుండ్లపల్లి నవీన్‌ చెట్లల్లోకి పరారయ్యారు. ఆవుదొడ్డి ప్రవీణ్‌ ఇదే ఇంట్లో ఉన్న వంట గదిలో దాచుకున్నాడు. వెంకన్నయాదవ్‌ తలదాచుకున్న ఇంటిని అప్పటికే గమనించిన వడ్డే ఎల్లయ్య, అతని అనుచరులు తల్వార్లు, కర్రలతో అక్కడికి చేరుకుని వెంకన్నయాదవ్, చింతలపాటి మధు దాచుకున్న గది తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లారు.

వడ్డే ఎల్లయ్య అతని అనుచరులు గదిలో కనిపించిన వెంకన్నయాదవ్‌ తలపై తల్వార్లతో విచక్షణారహితంగా దాడిచేశారు. తొలుత కర్రలతో దాడి చేయడంతో వెంకన్నయాదవ్‌ ఎడమ చెయ్యి విరిగి వంకర్లు పోయింది. ఆ తరువాత అతన్ని తల్వార్లతో తలమీద, వీపు వెనుకభాగంలో పొడిచారు. దీంతో రక్తమోడుతూ కింద పడిపోయిన వెంకన్న తలపై పక్కనే ఉన్న ఇసురు రాయితో మోదడంతో తల వెనుకభాగం పూర్తిగా ఛిద్రమై అక్కడికక్కడే మృతి చెందాడు. ఇదే సమయంలో హత్య జరిగిన గదిలో ఉన్న మధు పత్తి బస్తాల చాటున దాచుకోవడంతో నిందితుల కంటపడకుండా ఉన్నాడు. వెంకన్న మృతి చెందాడని నిర్ధారించుకున్న నిందితులు కారులో పారిపోయారు. 

గ్రామంలో ఉద్రిక్తత 
వెంకన్నయాదవ్‌ హత్యతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ హత్యోదంతం తెల్లవారేసరికి తెలిసిపోవడంతో గ్రామంతో పాటు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు, నేతలు సంఘటన స్థలానికి చేరుకున్నారు. డీఎస్పీ నాగేశ్వర్‌రావు, సీఐ శ్రీనివాస్, ఎస్‌ఐ శ్రీనివాస్‌లు హత్య జరిగిన సమాచారాన్ని తెలుసుకుని కొద్దిసేపటికే గ్రామానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని భారీ బందోబస్తుతో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. గ్రామంలో తదుపరి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు 200 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.  

మరిన్ని వార్తలు