అదృశ్యమైన యువకుడు దారుణ హత్య 

3 Apr, 2018 10:20 IST|Sakshi
 మృతుడు రాజునాయక్‌ (ఫైల్‌)

తుర్కయంజాల్‌: అదృశ్యమైన ఓ యువకుడిని అత్యంత దారుణంగా హత్య చేసి చెట్ల పొదల్లో మృతదేహాన్ని పడేసిన సంఘటన వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. వనస్థలిపురం సీఐ మురళీకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం... రంగారెడ్డి జిల్లా మంచాల మండలం సత్తి తండాకు చెందిన నేనావత్‌ రాజు నాయక్‌ (26) లింగోజిగూడ విజయపురికాలనీలో భార్య కవిత, ఇద్దరు పిల్లలతో నివాసముంటున్నాడు.

వృత్తిరీత్యా రాజునాయక్‌ మాదన్నపేటలోని ఓ హోటల్‌లో ఉదయం వేళల్లో వంట మాస్టర్‌గా పనిచేస్తున్నాడు. సాయంత్రం సంతోష్‌నగర్‌లో మిర్చి కొట్టు దగ్గర పనిచేస్తున్నాడు. గత నెల 31న రాత్రి 7 గంటల ప్రాంతంలో ఒక వ్యక్తి ఫోన్‌ చేసి పిలిపించుకున్నారని, ఆ తర్వాత రాజునాయక్‌ ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ కావడంతో కుటుంబ సభ్యులు సరూర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో అదృశ్యం అయినట్లు ఫిర్యాదు చేశారు. సోమవారం వనస్థలిపురం పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని ఇంజాపూర్‌ సాగర్‌ రోడ్డు పక్కనే ఉన్న విపశ్యన ధ్యాన కేంద్రం చెట్ల పొదల్లో రాజునాయక్‌ మృతదేహం, బైకు, చెప్పులు పడి ఉన్నాయి.

గమనించిన కొందరు వ్యక్తులు వనస్థలిపురం పోలీసులకు సమాచారం అందించడంతో వనస్థలిపురం సీఐ మురళీకృష్ణ, ఎస్సై రాజులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహం అదృశ్యమైన రాజు నాయక్‌దిగా గుర్తించారు. మృతదేహం కుళ్లిపోయి ఉందని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు