జవాన్‌ నాగరాజుకు రిమాండ్‌

25 Jul, 2018 11:30 IST|Sakshi

అనంతపురం సెంట్రల్‌: కోర్టు పరిధిలో ఉన్న స్థలంలో నిర్మాణానికి పూనుకుని పిస్టల్‌తో బెదరించాడన్న  అభియోగం నేపథ్యంలో బీఎస్‌ఎఫ్‌ జవాన్‌ నాగరాజుకు కోర్టు రిమాండ్‌ విధించింది. నాగరాజును సోమవారమే అదుపులోనికి తీసుకున్న నాల్గో పట్టణ పోలీసులు మంగళవారం జడ్జి ఎదుట ప్రవేశపెట్టగా..ఆగస్టు 17వ తేదీ వరకూ కోర్టు రిమాండ్‌ విధించినట్లు పోలీసులు తెలిపారు. సోమవారం రుద్రంపేట సమీపంలోని స్థల వివాదంలో బీఎస్‌ఎఫ్‌ జవాన్, మరోవర్గం వ్యక్తులు గొడవపడిన విషయం విదితమే.

లైసెన్స్‌డ్‌ తుపాకీతో బెదిరించాడని ఆర్మ్‌డ్‌యాక్టు, ఐపీసీ సెక్షన్‌ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే పోలీసులు వ్యవహరించిన తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపై ‘భరతమాత ముద్దు బిడ్డ.. పోలీసులకు సవతిబిడ్డ’ శీర్షికన సాక్షిలో కథనం ప్రచురితంకాగా...పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పునరాలోచనలో పడ్డ పోలీసులు జవాన్‌పై రాళ్లతో దాడి చేసేందుకు యత్నించిన వారిపై కూడా కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఈ విషయాన్ని డీఎస్పీ వెంకట్రావ్‌ అధికారికంగా ధ్రువీకరించారు. జవాన్‌కు బెయిల్‌ రాగానే ఫిర్యాదు తీసుకుంటామని వెల్లడించారు. 

మరిన్ని వార్తలు