బీటెక్‌ మానేసి చోరీల బాట

11 May, 2019 07:35 IST|Sakshi
వివరాలు వెల్లడిస్తున్న పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ తదితరులు, పోలీసుల అదుపులో నిందితుడు

బీటెక్‌ మానేసి చోరీల బాట

రెండుసార్లు పీడీ యాక్ట్‌ నమోదు  

వరుసగా ఇళ్లల్లో దొంగతనాలు  

నాలుగు నెలలల్లో 14 చోరీలు

మూడు కమిషనరేట్ల పరిధిలో పంజా

ఘరానా దొంగ నేనావత్‌ వినోద్‌కుమార్‌ అరెస్టు

రూ.22 లక్షల విలువైన సొత్తు స్వాధీనం  

సాక్షి, సిటీబ్యూరో: బీటెక్‌ చదువుతూ మధ్యలోనే మానేసిన ఓ యువకుడు జల్సాల కోసం అడ్డదారి తొక్కి బడా చోరుడిగా అవతారమెత్తాడు. 2014 నుంచి ఇప్పటివరకు ఇళ్లల్లో చోరీలు చేస్తూ పోలీసులకు పట్టుబడిన అతడిపై పీడీ యాక్ట్‌లు నమోదు చేసినా తీరు మార్చుకోలేదు. కారు డ్రైవర్‌గా చెలామణి అవుతూ తాళం వేసిన ఇళ్లను టార్గెట్‌ చేసుకుని ఒంటరిగా చోరీలకు పాల్పడుతున్న ఘరానా దొంగను ఈస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్, రెయిన్‌బజార్‌ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. అతడి నుంచి 53.4 తులాల బంగారు ఆభరణాలు, కిలో వెండి, నాలుగు ల్యాప్‌టాప్‌లు, బైక్, టీవీ, ట్యాబ్‌తో పాటు రూ.41,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం బషీర్‌బాగ్‌లోని నగర పోలీసు కమిషనరేట్‌లో సీపీ అంజనీకుమార్‌ వివరాలు వెల్లడించారు. 

నాలుగు నెలల్లో 14 చోరీలు...
రంగారెడ్డి జిల్లా అమన్‌గల్‌కు చెందిన నేనావత్‌ వినోద్‌ కుమార్‌ ఇబ్రహీంపట్నం ఏవీఎన్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ చదువుతూ మధ్యలోనే ఆపేశాడు. చెడు అలవాట్లకు బానిసైన అతను అనంతరం కారు డ్రైవర్‌గా మారాడు. ఈ సమయంలోనే 2014 నుంచి 2018 వరకు ఈజీమనీ కోసం 28 ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డాడు. చోరీకి అరగంట ముందు తాళం వేసి ఉన్న ఇళ్ల వద్ద రెక్కీ నిర్వహించి ఒంటరిగానే పని పూర్తి చేసుకొని వెళ్లేవాడు. 2015లో నగర పోలీసులకు చిక్కిన వినోద్‌కుమార్‌పై పీడీ యాక్ట్‌ ప్రయోగించారు. అనంతరం జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా మళ్లీ అదే పంథాను అనుసరిస్తున్న అతను 2017లో రాచకొండ పోలీసులకు చిక్కడంతో మరో సారి పీడీ యాక్ట్‌ ప్రయోగించారు. 2018 ఆగస్టులో జైలు నుంచి బయటికి  వచ్చిన అతను చోరీలకు పాల్పడుతూ అదే ఏడాది సెప్టెంబర్‌లోనే మీర్‌పేట పోలీసులకు చిక్కాడు. 2019 జవనరిలో జైలు నుంచి బయటికి వచ్చిన వినోద్‌కుమార్‌ కేవలం నాలుగు నెలల వ్యవధిలో హైదరాబాద్, రాచకొండ పోలీసు కమిషనరేట్ల పరిధిలో 14 ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డాడు. చోరీ చేసిన సొత్తును శంషీర్‌గంజ్‌కు చెందిన మదన్‌ కుమార్, గుజరాత్‌ వడోదరలోని నేహ జ్యూవెల్లరీ యజమానికి విక్రయించేవాడు. వారు ఇద్దరు పరారీలో ఉన్నట్లు సీపీ తెలిపారు. పీడీ యాక్ట్‌ నమోదైన నేరగాళ్లపై పోలీసు నిఘా ఉండటంతో తరచూ తన మకాం మారుస్తూ చోరీలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. వినోద్‌కుమార్‌పై మరోసారి పీడీ యాక్ట్‌ నమోదు చేయనున్నట్లు తెలిపారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును రెయిన్‌బజార్‌ పోలీసులకు అప్పగించారు. కార్యక్రమంలో టాస్క్‌ఫోర్స్‌ అడిషనల్‌ డీసీపీ ఎస్‌.చైతన్యకుమార్, ఈస్ట్‌జోన్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.శ్రీనివాస్, రెయిన్‌బజార్‌ ఇన్‌స్పెక్టర్‌ అంజనేయులు పాల్గొన్నారు. 

ఛేదించిన కేసులు
రెయిన్‌బజార్‌లో రెండు, వనస్థలిపురంలో రెండు, ఘట్‌కేసర్‌లో నాలుగు, సైఫాబాద్‌లో ఒకటి, మీర్‌పేటలో రెండు, ఎల్‌బీనగర్‌లో ఒకటి, బాలాపూర్‌లో ఒకటి, బంజారాహిల్స్‌ల ఒక చోరీకి పాల్పడినట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు