దొంగ ప్రియుడు... మొండి ప్రియురాలు

20 Jul, 2018 20:27 IST|Sakshi
దొంగతనం చేస్తూ సీసీ కెమెరాలకు చిక్కిన ప్రియుడు ఎస్‌.కె.ఇమ్రాన్, స్నేహితులు

సాక్షి, తాడేపల్లి రూరల్‌: విజయవాడకు చెందిన ఓ దొంగ బీటెక్‌ చదివే విద్యార్థినిని ప్రేమలోకి దించి, ఆమె మెప్పు పొందేందుకు దొంగతనాలకు పాల్పడుతూ సదరు యువతికి కావాల్సినవన్నీ కొంటూ, చివరకు పెళ్లి చేసుకునే తరుణంలో పోలీసులకు చిక్కి చెరసాల పాలైన సంఘటన గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌లో గురువారం చోటుచేసుకుంది.

సేకరించిన వివరాల ప్రకారం... విజయవాడ నగరంలోని పెజ్జోనిపేటలో నివాసం ఉండే ఎస్‌.కె.ఇమ్రాన్‌ ఐటీఐ చదువు మధ్యలో ఆపివేసి, జల్సాలకు అలవాటు పడ్డాడు. జల్సాలకు అవసరమైన డబ్బులు సంపాదించేందుకు కొంతమందితో కలిసి దొంగతనాలకు పాల్పడుతూ తన జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. ఇదే క్రమంలో ఓ ప్రైవేటు కళాశాలలో చదువుతున్న ఓ విద్యార్థిని పరిచయమైంది. అప్పట్లో ఇమ్రాన్‌ ఇంటికి వచ్చిన యువతి మైనర్‌ కావడంతో తల్లిదండ్రులు ఇంటికి తీసుకెళ్లారు. మంగళగిరి మండలం ఆత్మకూరులో నివాసం ఉండే ఆ యువతిని చూసేందుకు ఇమ్రాన్‌ గ్రామానికి వచ్చి దొంగతనానికి పాల్పడుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. అప్పట్లో మంగళగిరి పోలీసులు అతనిపై కేసు కూడా నమోదు చేశారు.

ఈ నేపథ్యంలో అయిదు రోజుల కిందట ఆ విద్యార్థిని మేజర్‌ అవడంతో తిరిగి ప్రియుడు ఇమ్రాన్‌ను వెతుక్కుంటూ విజయవాడ వెళ్లింది. ఇద్దరూ కలిసి పరారయ్యారు. యువతి తల్లిదండ్రులు మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ కేసు దర్యాప్తు చేస్తున్న క్రమంలో వడ్డేశ్వరంలోని ఓ యూనివర్సిటీలో విద్యనభ్యసిస్తూ బయట నివాసం ఉంటున్న విద్యార్థుల ల్యాప్‌టాప్‌లు పోయాయని తాడేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు కేసు నమోదు చేసి, సీసీ కెమెరాల ఫుటేజ్‌ ఆధారంగా దర్యాప్తు చేస్తుండగా, పాత నేరస్తుడు ఇమ్రాన్‌గా గుర్తించి, ఫోన్‌కాల్స్‌ డిటైల్స్‌ ఆధారంగా ఎక్కడ ఉన్నారో ట్రేస్‌ చేశారు. తాడేపల్లి పోలీసులు ఇమ్రాన్‌ను పట్టుకోవడానికి వెళ్లిన సమయంలో పక్కనే ఆ విద్యార్థిని ఉండడంతో, వారిద్దరిని, వారితోపాటు మరో ఇద్దరు యువకులను తాడేపల్లి పోలీస్‌స్టేషన్‌కు తీసుకొచ్చారు. ముందు నాకు పెళ్లి చేయండి, ఆ తర్వాతే కేస్‌ పెట్టండంటూ పోలీసుల కాళ్లావేళ్లా యువతి పడి బతిమిలాడడం గమనార్హం. బీటెక్‌ చదివే అమ్మాయి దొంగను పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టడం చూసి పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన వారంతా ముక్కుమీద వేలేసుకున్నారు. పోలీసులు మాత్రం బెయిల్‌ వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోమని యువతికి సూచించారు. విద్యార్థిని తన తల్లిదండ్రులతో పుట్టింటికి వెళ్లకుండా దొంగ ఇమ్రాన్‌ తల్లిదండ్రులతో కలసి వారింటికి వెళ్లడం విశేషం.

మరిన్ని వార్తలు