వేధింపులతోనే శ్రీహర్ష ఆత్మహత్య ?

23 Oct, 2019 07:56 IST|Sakshi
వైజాగ్‌ విద్యార్థి శ్రీహర్ష

వైజాగ్‌ విద్యార్థి ఆత్మహత్యపై ఆగ్రహవేశాలు

కళాశాల పాలకమండలిపై ఆరోపణలు

కర్ణాటక,బనశంకరి :   కాలేజీ యాజమాన్యం వేధింపులకు గురిచేస్తోందని తీవ్రమనస్థాపానికి గురైన ఇంజనీరింగ్‌ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పరప్పనఅగ్రహార పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. వివరాలు... ఆంధ్రప్రదేశ్‌ విశాఖపట్టణానికి చెందిన శ్రీహర్ష (20) సర్జాపురరోడ్డు కసవనహళ్లిలోని ఓ ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీలో ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌లో ఫైనల్‌ ఇయర్‌ చదువుతూ కాలేజీ హస్టల్‌లో ఉంటున్నాడు. ఇదిలా ఉంటే కాలేజీ హస్టల్‌లో నీరు, భోజన వ్యవస్థ సక్రమంగా లేదని ఆరోపిస్తూ వందలాదిమంది విద్యార్థులు గత నెల 23న రాత్రి ధర్నాకు దిగి వార్డెన్, వాహనాలపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన కాలేజీ యజమాన్యం కాలేజీ విద్యార్థుల గొడవపై విచారణకు ఓ కమిటీ ఏర్పాటు చేసింది. విచారణ చేపట్టిన కమిటీ గొడవకు పాల్పడిన 21 మంది విద్యార్థుల్లో శ్రీ హర్ష కూడా ఉన్నారు. ఇతడిపై క్రమశిక్షణ చర్యలకు విచారణ కమిటీ సిపారసు చేసింది.

ఈ క్రమంలో తండ్రిని పిలుచుకుని రావాలని శ్రీ హర్షకు విచారణ కమిటీ సూచించింది. ఈ నేపథ్యంలో విశాఖపట్టణం వెళ్లి తండ్రి విజయ్‌కుమార్‌తో కలిసి శ్రీహర్ష సోమ వారం ఉదయం కాలేజీ వద్దకు చేరుకున్నారు. కానీ కాలేజీ లోపలికి అనుమతించకపోవడంతో గేట్‌ వద్ద ఇద్దరు నిలబడ్డారు. శ్రీహర్షను మాత్రమే కాలేజీ లోపలికి పిలిపించి యజమాన్యం చర్చించినట్లు తెలిసింది. దీంతో తీవ్రమనస్థాపానికి గురైన శ్రీహర్ష మధ్యాహ్నం 12.30 సమయంలో 7వ అంతస్తు పైకెళ్లి అక్కడనుంది దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తక్షణం కాలేజీ సమీపంలో ఉన్న ఆసుపత్రికి తరలించలోగా మార్గమధ్యలో మృతి చెందారు. అనంతరం తండ్రి విజయ్‌కుమార్‌కు సమాచారం అందించడంతో కుమారుడి మృతి విషయం తెలుసుకుని విలపించడంతో వందలాదిమంది విద్యార్థులు కాలేజీ వద్దకు చేరుకుని ధర్నాకు దిగారు. తండ్రి విజయ్‌కుమార్‌ ఇతర విద్యార్థులు వచ్చేలోగా మృతదేహన్ని ఆసుపత్రికి తరలించి రక్తస్రావమైన స్ధలాన్ని శుభ్రం చేశారు. ఘటనాస్థలాన్ని వీడియో తీసిన కొందరు విద్యార్థుల మొబైల్‌ లాక్కొని వీడియో, ఫొటోలను డిలిట్‌ చేశారని కాలేజీ యజమాన్యంపై విద్యార్థులు ఆరోపించారు. పరప్పన అగ్రహర పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు. 

శ్రీహర్షకు క్యాంపస్‌ సెలక్షన్‌ :  ఇటీవల జరిగిన క్యాంపస్‌ ఎంపికలో శ్రీహర్షకు ఏడాదికి రూ.14 లక్షల వేతనంతో ఉద్యోగం లభించింది. అయితే కళాశాల యాజమాన్యం క్యాంపస్‌ సెలక్షన్‌ నియామక పత్రాన్ని అధికారులు శ్రీహర్ష నుంచి లాక్కొని అవమానించారు. దీంతో తీవ్ర మనస్థాపానికి గురై శ్రీహర్ష ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు తెలిపారు. 

శ్రీహర్ష మృతికి పాలక మండలి కారణం : తన కుమారుడు శ్రీహర్ష మృతికి కళాశాల పాలక మండలి కారణమని మృతుడు తండ్రి విజయ్‌ కుమార్‌ ఆరోపించారు. తనతో మాట్లాడాలని తీసుకెళ్లి తనను గేట్‌ వద్దే నిలబెట్టారని కుమారుడిని తీసుకెళ్లి మానసికంగా వేధింపులకు పాల్పడ్డారని మండిపడ్డారు. కాలేజీ అంతస్తుపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన విషయాన్ని తన దృష్టికి తీసుకురాకుండా ఆసుపత్రికి తరలించి ఘటనాస్ధలాన్ని శుభ్రం చేయడం అనేక అనుమానాలకు తావిస్తోందని, విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా