బీటెక్‌ దొంగలు..!

27 Apr, 2019 10:54 IST|Sakshi
మీడియాకు నిందితులను చూపుతున్న సీఐ చిన పెద్దయ్య

పోలీసులమంటూ దారిదోపిడీ

మోటార్‌ సైక్లిస్టులను చావబాదారు

వారి కష్టార్జితాన్ని లాక్కుని మస్తుగా ఎంజాయ్‌

కారు నంబర్‌ ఆధారంగా 24 గంటల్లోనే కేసు ఛేదన

వాళ్లంతా బీ.టెక్‌ పూర్తి చేశారు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డారు. మస్తుగా మందుకొట్టి, పోలీసులమంటూ దారిదోపిడీకి స్కెచ్‌ వేశారు. మోటార్‌ సైకిల్‌పై వెళ్తున్న ఇద్దరిని చితకబాది నగదు, సెల్‌ఫోన్లు లాక్కున్నారు. మళ్లీ  ఆ డబ్బుతో ఫుల్‌గా ఎంజా య్‌ చేశారు. ఆ మత్తు దిగేలోపు పోలీసులు వాళ్ల భరతం పట్టారు. నిందితులు దారిదోపిడీకి ఉపయోగించిన కారే  చివరకు వాళ్లను పోలీసులకు పట్టించింది!

చిత్తూరు, పీలేరు రూరల్‌ : నకిలీ పోలీసులు హల్‌ చల్‌ చేసి దోపిడీకి పాల్పడిన సంఘటన మండలంలోని వేపులబైలులో వెలుగులోకి వచ్చింది. శుక్రవారం పీలేరు అర్బన్‌ సీఐ చిన పెద్దయ్య తెలిపిన వివరాలు..మదనపల్లెకు  చెందిన రెడ్డిప్రసాద్, నాగేంద్ర తిరుపతిలో చిన్నపాటి పనులు చేసుకుంటూ కుటుంబాలను పోషిస్తున్నారు. తమ కష్టార్జితాన్ని ఇంటివద్ద ఇచ్చేందుకు ఈ నెల 24న రాత్రి ద్విచక్ర వాహనంలో తిరుపతి నుంచి మదనపల్లెకు బయల్దేరారు. మార్గమధ్యంలో వాటర్‌ బాటిల్‌ కోసం వేపులబైలు వద్ద ఆగారు. ఓ కూల్‌డ్రింక్‌ షాపులో వాటర్‌ బాటిల్‌ కొనుగోలు చేస్తుండగా పీలేరుకు చెందిన నిరంజన్‌ రెడ్డి (23), రెడ్డి శేఖర్‌ (22), రెడ్డి ప్రసాద్‌ (23) బంగారుపాళెంకు చెందిన చంద్ర (22) కారులో వచ్చారు. తాము పోలీసులమని ద్విచక్ర వాహనం రికార్డులు, డ్రైవింగ్‌ లైసెన్స్‌ చూపించాలని వారిని హడలెత్తించారు. ఇద్దరినీ చితకబాది 10,000 రూపాయలతో పాటు 2 సెల్‌ఫోన్లు లాక్కున్నారు. వీరి వాలకం అంతా అనుమానాస్పదంగా ఉండడంతో బాధితులకు వీళ్లు పోలీసులు కాదని బోధపడింది. ఇదే విషయమై ప్రశ్నించేసరికి పోలీసులకు సమాచారమిస్తే అంతు చూస్తామని బెదిరించి అక్కడ నుంచి అదృశ్యమయ్యారు. చేతిలో చిల్లిగవ్వ లేకుండా బాధితులు నేరుగా మదనపల్లెకు చేరుకున్నారు. మరుసటి  బాధితులు పీలేరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నిందితులను పట్టించిన కారు
దారిదోపిడీకి నిందితులు ఉపయోగించిన కారు కేసు ఛేదనలో కీలక ఆధారమైంది. బాధితులు అంతటి విపత్కర పరిస్థితుల్లోనూ నిందితులు ఉపయోగించిన స్విఫ్ట్‌ డిజైర్‌ కారు నంబర్‌ ఏపీ 27 ఏఎక్స్‌ 6969ను గుర్తు పెట్టుకుని పోలీసులకు చెప్పారు. దీంతో పోలీసులు ఆ కారు నంబర్‌ను లాగితే ఈ దోపిడీ డొంకంతా కదిలింది. నిందితులు అప్పటికింకా పీలేరులోనే ఉన్నారు. బాధితుల నుంచి లాక్కున్న డబ్బుతో మళ్లీ జల్సా చేశారు. కారుతో సహా అందరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి దోపిడీ సొత్తును రికవరీ చేశారు. శుక్రవారం సాయంత్రం కోర్టుకు హాజరు పరిచారు.

అందరూ బాల్య స్నేహితులే..ఒకరిపై ఆరు కేసులు
నిందితులు నలుగురూ బాల్యస్నేహితులేనని పోలీసుల దర్యాప్తులో తేలింది. అందరూ బీ.టెక్‌ పూర్తి చేశారు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డారు. వీరిలో నిరంజన్‌రెడ్డిపై మూడు ఎర్రచందనం కేసులు, మూడు గొడవ కేసులున్నట్లు సీఐ చెప్పారు. తన సోదరికి వివాహం కాబోతోందని, అందరూ కలిసి పార్టీ చేసుకుందామని నిరంజన్‌ రెడ్డి ఆహ్వానం మేరకు బాల్యస్నేహితులు కలిసినట్లు తెలియవచ్చింది. దోపిడీకి కూడా స్కెచ్‌ వేసింది ఇతగాడేనని తేలింది.

విస్తుపోయిన తల్లిదండ్రులు
తమ పుత్రరత్నాల ఘనకార్యం గురించి పోలీసులు చెప్పేవరకూ తెలియకపోవడంతో నిందితుల్లో ముగ్గురి తల్లిదండ్రులు విస్తుపోయారు. పోలీస్‌స్టేషన్‌లోనే వాళ్ల చెంపలు వాయించినట్లు తెలిసింది. చేతికొచ్చిన పిల్లలను తల్లిదండ్రులు ఓ కంట కనిపెట్టకపోతే చివరకు పోలీస్‌ స్టేషన్‌ గడప ఎక్కాల్సి వస్తుందనడానికి ఇదో ఉదాహరణ.

మరిన్ని వార్తలు