పూలకు వెళితే.. ప్రాణం పోయింది

18 Oct, 2018 11:10 IST|Sakshi
ప్రమాద స్థలంలో గ్రామస్తులు, కుటుంబీకులు, పోలీసులు 

సాక్షి, కల్లూరు రూరల్‌: తంగేడు పూల కోసం వెళ్లిన అతడు.. శవమై తిరిగొచ్చాడు. కల్లూరు మండలం కొర్లగూడెం గ్రామస్తుడు గడ్డం శ్రీనివాసరెడ్డి(47), తన స్నేహితులైన బండి వెంకటేశ్వర్లు, కాకర్ల నర్సింహారావుతో కలిసి బుధవారం తెల్లవారుజామున కృష్ణా జిల్లా గంపలగూడెం మండలం చిక్కులగూడెం (కనుమూరి అడవి) గ్రామానికి తంగేడు పూల కోసం వెళ్లాడు. సరిగ్గా అక్కడే, అడవి జంతువులను బలిగొనేందుకు బుల్లెట్‌ మైన్‌ను వేటగాళ్లు అమర్చారు. జంతువులు అటువైపు రాగానే ఆ మైన్‌ నుంచి విషపూరితమైన బుల్లెట్‌ దూసుకెళ్లి చంపుతుంది. ఈ విషయం వీరికి తెలియదు. అక్కడ పూలు కోస్తున్న తూటా గడ్డం శ్రీనివాసరెడ్డి వైపునకు బుల్లెట్‌ దూసుకొచ్చింది. తొడలో నుంచి వెళ్లింది. అతడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఇది జరిగిన వెంటనే ఆ ఇద్దరు స్నేహితులు భయాత్పాతానికి లోనయ్యారు.

పరుగు పరుగున గ్రామంలోకి వెళ్లారు. ఆ బుల్లెట్‌ మైన్‌ అమర్చింది కావేటి దుర్గారావు. అతడొక వేటగాడు. అక్కడకు కొంచెం దగ్గరలోనే కాపుగాశాడు. బుల్లెట్‌ దూసుకెళ్లడంతో జంతువు చనిపోయిందనుకుని వచ్చేసరికి... రక్తస్రావంతో మనిషి కనిపించాడు. భయంతో పారిపోయాడు. శ్రీనివాసరెడ్డి స్నేహితులు ఇచ్చిన సమాచారంతో కొర్లగూడెం గ్రామస్తులు, కుటుంబీకులు, పోలీసులు వచ్చారు. ప్రమాద కారణాలను తెలుసుకున్నారు. బుల్లెట్‌ మైన్‌ ఏర్పాటు చేసిన వేటగాడు కావేటి దుర్గారావు, కృష్ణా జిల్లా కొండూరు గ్రామస్తుడని, పోలీసులకు లొంగిపోయాడని తెలిసింది. శ్రీనివాసరెడ్డికి భార్య కృష్ణకుమారి, కుమారుడు, కుమార్తె సుష్మ, అల్లుడు ఉన్నారు. కొర్లగూడెం గ్రామంలో చిన్నపాటి బడ్డీకొట్టు నడుపుతున్నాడు. అదే, ఇతడి జీవనాధారం.  కృష్ణా జిల్లా తిరువూరు ప్రభుత్వాసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం  మృతదేహాన్ని కుటుంబీకులకు పోలీసులు అప్పగించారు. గంపలగూడెం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు