రౌడీషీట్‌ ఓపెన్‌ పేరుతో బెదిరింపు

10 Oct, 2017 02:41 IST|Sakshi

వద్దనుకుంటే ఒక్కొక్కరు రూ.6లక్షలు ఇవ్వాలట

ఇవ్వలేమన్నందుకు ఎస్‌ఐ యువరాజు కక్షసాధింపు

సర్పంచ్‌ పాటిల్‌ చెన్నకేశవరెడ్డి ఆరోపణ

కణేకల్లు: యర్రగుంటలో రెండు నెలల క్రితం పబ్లిక్‌ కొళాయి విషయంలో జరిగిన గొడవలకు సంబంధించి బాధితులైన తమపైనే రౌడీషీట్‌ తెరుస్తామంటూ కణేకల్లు ఎస్‌ఐ యువరాజు తమను బెదిరిస్తున్నారని సర్పంచ్‌ పాటిల్‌ చెన్నకేశవరెడ్డి ఆరోపించారు. సోమవారం ఆయన తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ జెడ్పీటీసీ సభ్యుడు పాటిల్‌ నాగిరెడ్డి, వైఎస్సార్‌సీపీ నాయకులు చంద్రమౌళిరెడ్డి, నవీన్‌కుమార్‌రెడ్డి, శ్రీనివాసులు, రామిరెడ్డిలతో కలిసి ఆయన మాట్లాడారు. రౌడీషీట్‌ ఓపెన్‌ చేయకుండా ఉండాలంటే ఒక్కొక్కరు రూ.6లక్షలు ఇవ్వాలని, అది కూడా తమకేమీ కాదని పై అధికారుల కోసమని డిమాండ్‌ చేశారన్నారు.

ఇప్పటికే అక్రమ కేసులతో తాము చాలా ఇబ్బందులు పడుతున్నామని, అంత డబ్బు ఇచ్చుకోవడం తమవల్ల కాదని చెప్పడంతో ఎస్‌ఐ కక్ష పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార తెలుగుదేశం పార్టీ నేతల మెప్పు కోసం తమపై రౌడీషీట్‌ ఓపెన్‌ చేసేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. ఎస్‌ఐ చర్యల వల్ల తమ కుటుంబ సభ్యులు మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని వాపోయారు. ఎస్‌ఐ ఆగడాలు, తమపై బనాయించి అక్రమకేసుల గురించి మానవహక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళుతున్నట్లు వారు తెలిపారు.   

మరిన్ని వార్తలు