11 మంది మరణం: అతడే సూత్రధారి

3 Jul, 2018 13:15 IST|Sakshi
కుటుంబ సభ్యులను ఆత్మహత్యలకు ప్రేరేపించిన లలిత్‌ భాటియా

సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని బురారీ ప్రాంతంలో కలకలం రేపిన ఒకే కుటుంబానికి చెందిన 11 మంది మరణాల వెనుక ఉన్న అసలు రహస్యాన్ని చేధించారు ఢిల్లీ పోలీసులు. మొదటి నుంచి కేసులో కీలకంగా మారిన రిజిష్టర్‌లోని ప్రతుల్లోని చేతి రాతలు, మృతుల్లో ఒకడైన లలిత్‌ భాటియా చేతి రాతతో సరిపోయినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో కేసు ఓ కొలిక్కి వచ్చింది. లలిత్‌ భాటియాకు ఉన్న భ్రమలు, ఆత్మల పట్ల నమ్మకాలే అతనితో పాటు మిగతా కుటుంబ సభ్యులను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాయని పోలీసులు తెలిపారు.

ఎవరీ లలిత​భాటియా...
నారాయణ దేవి(77) చిన్న కుమారుడు లలిత్‌ భాటియా(45). తనతో పాటు తన కుటుంబానికే చెందిన మరో 10 మంది సామూహిక ఆత్మహత్యలకు ప్రణాళిక రూపొందించిన వ్యక్తి కూడా ఇతనే. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కిరాణా దుకాణం నడుపుతున్న లలిత్‌ భాటియా ఐదేళ్ల నుంచి మౌనవ్రతాన్ని పాటిస్తున్నాడు. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో చివరకు దుకాణానికి వచ్చిన వారితో కూడా మూగ సైగలు, చేతి రాతల ద్వారానే సంభాషించేవాడు. ఇలాంటిది ఉన్నట్టుండి గత కొంతకాలం నుంచి భాటియా కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నాడు. అది కూడా తన తండ్రి తనకు ‘కనిపించినప్పటి నుంచి’. కనిపించడం ఏంటంటే లలిత్‌ భాటియా తండ్రి పదేళ్ల క్రితమే మరణించాడు. మరణించిన తండ్రి తనకు కనిపిస్తున్నాడని, తనతో మాట్లాడుతున్నాడని.. తనకు సందేశాలు ఇస్తున్నాడని కుటుంబ సభ్యులకు చెప్పేవాడు భాటియా. ఈ క్రమంలోనే తండ్రి సందేశాలను రిజిస్టర్‌లో రాసి మిగతా కుటుంబ సభ్యులకు తెలిపేవాడు. అందులో భాగంగానే రిజిస్టర్‌లో ఒక చోట ‘త్వరలోనే మీ ఆఖరి కోరికలు నెరవేరతాయి. అప్పుడు ఆకాశం తెరుచుకుంటుంది. భూమి కంపిస్తుంది. కానీ ఎవరూ భయపడకండి. గట్టిగా మంత్రాన్ని జపించండి నేను మిమ్మల్ని కాపాడతాను’ అని తండ్రి తనతో చెప్పినట్లు కాగితంలో రాసి కుటుంబ సభ్యులకు తెలిపాడు.

లలిత్‌ భాటియా చెప్పిన విషయాలను మిగతా కుటుంబ సభ్యులు కూడా నమ్మి అతడు చెప్పినట్లే ఆత్మహత్య చేసుకున్నారని నిర్ధారించారు పోలీసులు. మోక్షం పొందాలనే కోరికతో... మంత్ర, తంత్రాలపై ఉన్న మూఢనమ్మకంతోనే ఇలా సామూహిక ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు తేల్చారు. మొదటి నుంచి అందరిలోనూ రేకెత్తిన  అనుమానాలకు  పేపర్లలో ఉన్నచేతి రాతలను గుర్తించడం ద్వారా సమాధానం దొరికిందని పోలీసులు చెప్పారు. లలిత్‌ భాటియాకు ఉన్న భ్రమలే కుటుంబ సభ్యులందరిని మూకుమ్మడిగా ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాయని పోలీసులు నిర్ధారించారు.

పోస్టుమార్టం నివేదికలు...
11 మందిలో ఇప్పటి వరకు ఆరుగురి పోస్ట్‌మార్టం నివేదికలు వచ్చాయి. ఉరితీత వల్ల వారి మరణాలు సంభవించినట్లు డాక్టర్లు తేల్చారు. వారి శరీరాలపై ఎటువంటి గాయాల గుర్తులు లేవని నివేదికలు పేర్కొన్నాయి. మృతుల నేత్రాలను దానం చేయాలని వారి కుటుంబసభ్యులు కోరారు. ఇంతమంది మృతదేహాలను రాజస్థాన్‌లోని స్వగ్రామానికి తీసుకుని వెళ్లి అంత్యక్రియలు నిర్వహించడం కష్టం కనుక ఢిల్లీలోనే అంత్యక్రియలు జరపాలని వారు నిర్ణయించారు.

మరిన్ని వార్తలు