బురారీ కేసు; దిగ్భ్రాంతికర విషయాలు

2 Jul, 2018 09:33 IST|Sakshi

న్యూఢిల్లీ : సంచలనం సృష్టించిన బురారీ ఆత్మహత్యల కేసులో ఆరు మృతదేహాలకు పోస్టు మార్టమ్‌ పూర్తయింది. అయితే పోస్టుమార్టమ్‌ రిపోర్టులో ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయంటున్నారు అధికారులు. పోస్టుమార్టమ్‌ రిపోర్టు ప్రకారం వారంతా కావాలనే, చనిపోవాలని నిశ్చయించుకునే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. చనిపోయిన సమయంలో ఎటువంటి పెనుగులాట జరగలేదన్నారు.

మోక్షం పొందడం కోసమే వీరంతా ఇలా చేసి ఉంటారని పోలీసులు తెలిపారు. అంతేకాక మరణించిన కుటుంబ సభ్యులు తమ కళ్లను దానం చేసినట్లుగా పోలీసులు వెల్లడించారు. మిగిలిన ఐదు మృతదేహాలకు రేపు అనగా మంగళవారం పోస్టుమార్టమ్‌ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

ఢిల్లీలోని బురారి ప్రాంతంలో నివాసం ఉంటున్న ఒకే కుటుంబంలోని 11 మంది అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన సంగతి తెలిసిందే. కుటుంబ సభ్యుల్లో 10 మంది ఇంట్లోని సీలింగ్‌కు ఉన్న ఇనుప కమ్మీలకు వేలాడుతుండగా, మరో వృద్ధురాలు(75) గొంతు కోయడం వల్ల చనిపోయింది. అలాగే వీరి నోటికి టేప్‌ అంటించారన్నారు. పోలీసుల తనిఖీల్లో ఈ ఇంట్లో తాంత్రిక పూజలకు సంబంధించిన చేతిరాతతో ఉన్న పేపర్లు లభ్యమయ్యాయి.

ఈ పత్రాలను బట్టి కుటుంబం మొత్తం తాంత్రిక పూజల్లో పాల్గొనేదని తెలుస్తోందన్నారు. ఈ కాగితాల్లో ఉన్నట్లుగానే కుటుంబ సభ్యుల్ని చేతులకు కట్లు, కళ్లకు గంతలు కట్టారన్నారు. అంతేకాకుండా అరవకుండా నోటికి టేప్‌ను అంటించారన్నారు. కుటుంబసభ్యుల్లో తాంత్రిక శక్తులతో ప్రభావితమైన ఒకరు మిగిలిన 10 మందిని హత్యచేసి తానూ ఆత్మహత్య చేసుకుని ఉంటాడని భావిస్తున్నామని పోలీసులు తెలిపారు.

తొలుత నిందితుడు అందరికీ భోజనంలో మత్తుమందు కలిపి ఇచ్చి స్పృహ కోల్పోయాక వారందర్నీ ఉరితీసి ఉంటాడని వెల్లడించారు. ఈ సందర్భంగా కుటుంబంలోని వృద్ధురాలు స్పృహలోకి రావడంతో ఆమెను సదరు వ్యక్తి గొంతుకోసి చంపాడన్నారు.

మరిన్ని వార్తలు