బురారీ కేసు.. ప్రమాదం మాత్రమే : ఫోరెన్సిక్‌ రిపోర్టు

15 Sep, 2018 09:03 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బురారీ సామూహిక మరణాల మిస్టరీ వీడింది. భాటియా కుటుంబ సభ్యులవి ఆత్మహత్యలు కావని.. పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుండగా జరిగిన ప్రమాదం మాత్రమేనని సీబీఐ- సెంట్రల్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ నివేదిక ఇచ్చింది. గత జూన్‌లో ఢిల్లీలోని బురారి ప్రాంతంలో నివాసం ఉంటున్న ఒకే కుటుంబంలోని 11 మంది అనుమానాస్పద స్థితిలో మరణించిన విషయం తెలిసిందే. వారిలో 10 మంది ఇంట్లోని సీలింగ్‌కు ఉన్న ఇనుప కమ్మీలకు వేలాడుతుండగా, ఇంటి యజమాని నారాయణ దేవి (75) గొంతు కోయడం వల్ల చనిపోయింది.

కాగా తాంత్రిక పూజల ప్రభావానికి లోనుకావడం వల్లే వీరంతా ఆత్మహత్యకు పా‍ల్పడ్డారని పోలీసులు భావించారు. భాటియా కుటుంబ సభ్యుల్లో ఒకడైన లలిత్‌ భాటియా మూఢనమ్మకాల కారణంగానే ఈ కుటుంబం ఆత్మహత్య చేసుకుందని విచారణలో వెల్లడైంది. అయితే భాటియా కుటుంబంలోని ఇతర వ్యక్తులు ఈ విషయాన్ని వ్యతిరేకించారు. కానీ పోస్టుమార్టం రిపోర్టులో ఉరివేసుకోవడం వల్లే మరణించారని నివేదిక రావడంతో ఢిల్లీ పోలీసులు ఈ కేసును సవాలుగా తీసుకున్నారు. వీరి మరణాలకు గల స్పష్టమైన కారణాలు తెలుసుకునేందుకు.. మృతుల సైకలాజికల్‌ అటాప్సీ నివేదిక ఇవ్వాల్సిందిగా సీబీఐ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు లేఖ రాశారు. వీరికి ఆత్మహత్య చేసుకోవాలనే భావన ఏమాత్రం లేదని.. ఇదొక ప్రమాదమని ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ బుధవారం సాయంత్రం నివేదిక ఇచ్చింది.

సైకలాజికల్‌ అటాప్సీ అంటే...
మెడికల్‌ రిపోర్టుల ఆధారంగా ఒక వ్యక్తి మానసిక స్థితిని అధ్యయనం చేసే ప్రక్రియనే సైకలాజికల్‌ అటాప్సీ అంటారు. సైకలాజికల్‌ అటాప్సీలో వ్యక్తి స్నేహితులు, వ్యక్తిగత డైరీలు, కుటుంబ సభ్యులు చెప్పిన విషయాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. బురారీ కేసులో కూడా ఈ ప్రక్రియనే అనుసరించామని సీనియర్‌ పోలీసు అధికారి తెలిపారు. సైకలాజికల్‌ అటాప్సీలో భాగంగా భాటియా కుటుంబ యజమాని నారాయణ దేవి పెద్ద కుమారుడు దినేశ్‌ సింగ్‌ చందావత్‌, అతడి సోదరి సుజాతా నాగ్‌పాల్‌ల కుటుంబ సభ్యులు, స్నేహితులు, లలిత్‌ భాటియా డైరీలు, రిజిస్టర్లు, ఇరుగుపొరుగు వారు చెప్పిన విషయాల ఆధారంగా ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ నివేదిక ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు