మాజీ సీఎం సహా ప్రముఖులను కుదిపేస్తున్న సెక్స్‌ రాకెట్‌!

25 Sep, 2019 16:16 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

భోపాల్‌: తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఒక ఇంజనీర్‌ పోలీసులకు ఇచ్చిన కంప్లయింట్‌తో భారీ సెక్స్‌ రాకెట్‌ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఈ విషయంపై పోలీసులు లోతుగా విచారణ చేపట్టడంతో.. 'ఆ' మూలాలు మధ్యప్రదేశ్ అగ్ర నాయకత్వాన్ని చిక్కుల్లో పడేశాయి.  ప్రస్తుతం మధ్యప్రదేశ్‌ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న సెక్స్‌ రాకెట్‌ కుంభకోణంలో నిజాలను నిగ్గు తేల్చేందుకు ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ కుంభకోణంలో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సహా పలువురు రాజకీయ నాయకులు, ఉన్నతాధికారుల పేర్లు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

సెక్స్‌ రాకెట్‌లో బాలీవుడ్‌కు చెందిన కొంతమంది బీ-గ్రేడ్ హీరోయిన్‌లతో సహా 40 మందికి పైగా కాల్ గర్ల్స్ ప్రైవేట్‌ వీడియోలు చూపించి బ్లాక్ మెయిలింగ్‌ రాజకీయాలకు తెరలేపినట్లు తెలుస్తోంది. అయితే వీడియో క్లిప్‌లను ఫోరెన్సిక్ విభాగం పరిశీలించిన తరువాత ఎక్కడికక్కడ వ్యవస్థీకృతంగా వేళ్లూనుకొనిపోయిన బ్లాక్ మెయిలింగ్‌ వ్యవస్థను, వ్యక్తులను గుర్తిస్తామని కేసును విచారిస్తున్న సిట్ వర్గాలు వెల్లడించాయి. మధ్యప్రదేశ్‌లో జరిగిన బ్లాక్ మెయిలింగ్ కుంభకోణం ఉచ్చులో ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, మధ్యప్రదేశ్ గవర్నర్‌తో సహా పలువురు ప్రముఖులు చిక్కుకుపోవడం విస్మయానికి గురి చేస్తోంది. బ్యూరోక్రాట్లు, రాజకీయ నాయకులను అభ్యంతకర భంగిమల్లో ఉన్నప్పుడు చిత్రీకరించిన 92 హైక్వాలిటీ వీడియో క్లిప్‌లు ఇప్పటికే పోలీసు అధికారుల చేతికందాయి. అంతేకాక ఈ రాకెట్‌తో సంబంధం ఉన్నట్లుగా భావిస్తున్న ఐదుగురు మహిళలను అరెస్ట్‌ చేసి, రెండు ల్యాప్‌టాప్‌లు స్వాధీనం చేసుకొన్నారు.

సెక్స్ కుంభకోణంలో బీజేపీ నాయకులపై కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కక్ష సాధిస్తోందని.. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్ విజయవర్గియా డిమాండ్‌ చేశారు. అయితే ఈ ఆరోపణల మధ్య మంగళవారం ఈ కేసును విచారిస్తున్న సిట్‌కు (ప్రత్యేక దర్యాప్తు బృందం) నేతృత్వం వహిస్తున్న డి. శ్రీనివాస్‌ను తప్పించారు. ఆయన స్థానంలో సీనియర్ ఐపీఎస్ అధికారి సంజీవ్ షమీకి దర్యాప్తు బాధ్యతలు అప్పగించారు. 

ఈ నేపథ్యంలో బ్యూరోక్రాట్లు, పలువురు ప్రముఖ రాజకీయ నాయకుల హనీట్రాప్‌కు సూత్రధారిగా వ్యవహరించిన శ్వేతా స్వాప్నిల్ జైన్‌ను సిట్ అరెస్టు చేసింది. అధికారులు తెలిపిన కథనం ప్రకారం.. శ్వేతా తాను లక్ష్యంగా చేసుకొన్న ఒక బ్యూరోక్రాట్ లేదా మంత్రిని గెస్ట్ హౌస్ లేదా తాను ఎంపిక చేసుకొన్న ఫైవ్ స్టార్ హోటల్‌కు ఆహ్వానించేది. ఆమె వలలో చిక్కుకున్న సదరు 'టార్గెట్‌' అధికారిక పర్యటనల నిమిత్తం ముంబై, ఢిల్లీకి వెళితే.. వారి డిమాండ్ మేరకు టాప్‌ మోడల్స్, కాల్‌గర్ల్స్‌, బాలీవుడ్ నటీమణులను ఎరవేసేది. ఇదే అదనుగా 'టార్గెట్' శృంగారంలో పాల్గొంటుండగా చాటుగా వీడియోను చిత్రీకరించేవారు. అనంతరం వాటిని చూపి సదరు వ్యక్తులను బ్లాక్‌మెయిల్‌ చేసేవారు. కాగా తన భర్త స్వాప్నిల్ జైన్ నిర్వహిస్తున్న ఓ ఎన్జీవో కోసం నిధులు సేకరించే క్రమంలో పలువురుని హనీట్రాప్‌లోకి లాగినట్లు సమాచారం. ఈ క్రమంలో ఆమె భర్త నుంచి ఐదు హార్డ్ డిస్కులను సిట్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.  ఇక విచారణంలో భాగంగా మధ్యప్రదేశ్‌ మాజీ సీఎం తనకు భోపాల్‌లోని ఖరీదైన ప్రాంతమైన మినల్ రెసిడెన్సీలో ఒక బంగ్లా బహుమతిగా ఇచ్చినట్లు ఈ మేరకు శ్వేతా అంగీకరించారు. శ్వేతా జైన్‌తో పాటు, మరో మహిళ ఆర్తీ దయాల్ కూడా ఐఏఎస్ అధికారి నుంచి గిఫ్ట్‌గా భోపాల్‌లో ఒక ఫ్లాట్ పొందానని అంగీకరించారు.

కాగా.. సెక్స్ రాకెట్‌లో మాజీ మంత్రులు, బ్యూరోక్రాట్ల ప్రమేయంపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ ప్రతినిధి కేకే మిశ్రా మాట్లాడుతూ.. భోపాల్, ఇండోర్‌ వంటి ప్రముఖ పట్టణాల్లో సెక్స్‌ రాకెట్‌ చాలా సంవత్సరాలుగా సాగుతోందని, బ్లాక్ మెయిల్‌కు గురైన రాజకీయ నాయకులలో 80 శాతం మంది బీజేపీకి చెందినవారేనని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ నాయకుల ప్రమేయం ఉన్నట్లు రుజువైతే చట్టపరమైన చర్యలు తప్పవని అన్నారు.

మరిన్ని వార్తలు