అత్యాచారం, వేధింపులు.. ప్రముఖ వ్యాపారి అరెస్ట్

23 Apr, 2018 08:42 IST|Sakshi

అగర్తలా: కఠిన చట్టాలు చేస్తూ నిందితులకు శిక్షలు వేస్తున్నా మృగాళ్లలో మార్పు రావడం లేదు. తాజాగా త్రిపురలో ఇలాంటి కీచక ఘటన వెలుగుచూసింది. బాధిత బాలిక ఫిర్యాదు మేరకు వ్యాపారవేత్త, బీజేపీ మద్దతుదారుడు మనోజ్ డెబ్‌(54)ను పోలీసులు అరెస్ట్ చేశారు. 

ఆ వివరాలిలా.. త్రిపుర ఖోవాయి జిల్లా తెలియమురాకు చెందిన మనోజ్ డెబ్ పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నాడు. బీజేపీ నేతగా ప్రచారం చేసుకునే ఈ నిందితుడు ఛంప్లాయ్‌లోని తన ఫామ్‌హౌస్‌లో బాలిక(14)పై ఈ ఏడాది ఫిబ్రవరి 11న తొలిసారి అత్యాచారం చేశాడు. ఆపై ఆ కీచకపర్వాన్ని అలాగే కొనసాగించాడు. ఈ క్రమంలో ఇప్పటివరకూ నాలుగు పర్యాయాలు బాధితురాలిపై లైంగికదాడి చేశాడు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించినట్లు ఫిర్యాదులో బాలిక పేర్కొంది. గతవారం మళ్లీ ఫామ్‌హౌస్‌కు రావాలని నిందితుడు మనోజ్ కోరగా.. బాలిక తన స్నేహితురాలికి విషయం చెప్పింది. బిషాల్‌గఢ్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలని ఫ్రెండ్ సూచించగా.. ధైర్యం తెచ్చుకుని తాను పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వివరించింది. 

ఖోవాయి ఎస్పీ క్రిష్ణేందు చక్రవర్తి మాట్లాడుతూ.. నిందితుడు మనోజ్ డెబ్‌కు తెలియమురాలో పెద్ద వ్యాపారవేత్త అని, కేసును ప్రభావితం చేయగల వ్యక్తి కూడా అని తెలిపారు. బాలిక ఫిర్యాదు చేయగా అత్యాచారంతో పాటు పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టినట్లు వెల్లడించారు.  


   

మరిన్ని వార్తలు