వ్యాపారవేత్తకు జీవిత ఖైదు, రూ. 5 కోట్ల ఫైన్‌!

11 Jun, 2019 19:52 IST|Sakshi

న్యూఢిల్లీ : విమానాన్ని హైజాక్‌ చేస్తామంటూ ప్రయాణీకులు, సిబ్బందిని భయాందోళనకు గురిచేసిన ముంబైకి చెందిన వ్యాపారవేత్త బిర్జు సల్లాకు జాతీయ దర్యాప్తు సంస్థ ప్రత్యేక న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అదే విధంగా బాధితులకు నష్ట పరిహారంగా 5 కోట్ల రూపాయల జరిమానా చెల్లించాలని ఆదేశించింది. 2017లో జెట్‌ఎయిర్‌వేస్‌కు చెందిన 9W339 నంబరు గల విమానంలో బిర్జు ప్రయాణించాడు. ఈ క్రమంలో..‘ ఈ విమానాన్ని పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌కు తీసుకువెళ్లాలి. లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అల్లా గ్రేట్‌’ అంటూ పలు బెదిరింపులతో టిష్యూ పేపర్‌పై లేఖ రాసి టాయిలెట్‌లో ఉంచాడు. ఇంగ్లీష్‌, ఉర్దూ భాషల్లో రాసిన ఈ లేఖను చూసి బెంబేలెత్తిపోయిన సిబ్బంది హుటాహుటిన విమానాన్ని అహ్మదాబాద్‌ ఎయిర్‌పోర్టులో నిలిపివేశారు. దీంతో ప్రయాణీకులు తీవ్ర అసౌర్యానికి గురయ్యారు.

ఈ క్రమంలో బిర్జును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యాంటీ హైజాక్‌ చట్టం కింద అరెస్టు చేసి సెక్షన్‌ 3(1), 3(2)(a), 4(b)ల కింద కేసు నమోదు చేశారు. బిర్జు ఉద్దేశపూర్వకంగానే ప్రయాణీకులకు ఇబ్బంది కలిగించాడని, దీనికి ఉగ్రవాదులతో సంబంధం లేదని ఎన్‌ఐఏ అధికారులు నిర్ధారించారు. విచారణలో భాగంగా.. తన గర్ల్‌ఫ్రెండ్‌ జెట్‌ఎయిర్‌వేస్‌ ఢిల్లీ విభాగంలో పనిచేస్తుందని, ఇలా చేయడం ద్వారా అక్కడి ఆఫీసును మూసివేస్తే తనతో పాటు ముంబైకి వస్తుందనే ఆశతో హైజాక్‌ చేస్తామంటూ లేఖ రాశానని ఒప్పుకొన్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో అతడికి జీవిత ఖైదుతో పాటు భారీ జరిమానా విధిస్తూ ఎన్‌ఐఏ కోర్టు మంగళవారం తీర్పునిచ్చింది.

మరిన్ని వార్తలు