ఏజెంట్‌ ‘కాల్‌’నాగు!

14 Nov, 2018 12:58 IST|Sakshi

పంథా మార్చి కొనసాగిస్తున్న కీచకపర్వం

రికవరీ ఏజెంట్లుగా కొత్త అవతారం

వాయిదాలు చెల్లించని రుణగ్రహీతలకు బెదిరింపు

మహిళలకు ఫోన్లు చేసి అసభ్యపద జాలంతో వేధింపులు

స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా.. పట్టించుకోని పోలీసులు

నగరంలో రెండో పోలీసు స్టేషన్‌ పరిధిలో నివసిస్తున్న ఓ ప్రభుత్వ ఉద్యోగి ఇటీవల  ఓ ప్రైవేటు ఫైనాన్స్‌ కంపెనీ నుంచి రూ. 1.20 లక్షలు అప్పుగా తీసుకున్నారు. వాయిదాలు చెల్లించడంలో జాప్యం జరిగింది. దీంతో ఆ కంపెనీ పేరిట రికవరీ ఏజెంట్‌ ఒకరు ఫోన్‌ చేసి పేపర్‌లో రాయడానికి వీలుకాని భాషలో  తిట్టి భయభ్రాంతులకు గురిచేశారు.

అదే ప్రాంతంలో నివసిస్తున్న మరో మహిళకు సైతం ఇలాగే ఫోన్లు చేసి బెదిరించారు. నీ అప్పు నేను కడుతాను.. నాకు కావాల్సింది నువ్వు ఇవ్వు.. అంటూ చెప్పుకోలేని రీతిలో అసభ్యంగా ప్రవర్తించారు. ప్రతిరోజూ ఇలా ఫోన్లు చేస్తుండటంతో ఆ మహిళ ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసేసింది. అయినా వదలని రికవరీ ఏజెంట్లు ఇంటికెళ్లి బెదిరించడం కొసమెరుపు.రూటు మార్చిన ‘కాల్‌’నాగులు ఏజెంట్‌ అవతారంలో సాగిస్తున్నకీచకపర్వనానికి ఉదాహరణలు ఇవి.

సాక్షి, అమరావతిబ్యూరో: నగరంలో కీచకుల ఆగడాలకు అంతేలేకుండా పోతోంది. గతంలో కాల్‌మనీ వ్యాపారం పేరిట కొందరు స్వార్థ రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు, డబ్బున్నవారు కుమ్మక్కై నిర్లజ్జగా జనం మానప్రాణాలతో ఆడుకున్నారు. రూ. 100కి రూ. 20 వడ్డీ వసూలు చేసి పేద, మధ్యతరగతి ప్రజలను పీల్చి పిప్పి చేశారు. అప్పులిచ్చి మహిళలను బెదిరించి లైంగికంగా వేధించారు. ఈ కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌ కుంభకోణంతో ఇప్పటికే విజయవాడ పరువు చిన్నబోయింది. అనంతరం ఈ రాకెట్‌ గుట్టు రట్టవ్వడంతో అజ్ఞాతంలోకి వెళ్లిన ఆ వ్యాపారులు ఇప్పుడు మళ్లీ కొత్త అవతారం ఎత్తారు. ఆధీకృత వడ్డీ డీలర్ల వద్ద 20 శాతం కమీషన్‌ తీసుకుని బకాయిలు వసూలు చేసే పనికి దిగారు. అయి తే ఇక్కడా బలవంతపు వసూళ్లు, లైంగిక వేధింపులకు దిగడం మాత్రం మానకపోవడం విశేషం.

పోలీసుల నిర్లిప్తత..
రికవరీ ఏజెంట్ల ముసుగులో ఉన్న కాల్‌మనీ ముఠా సభ్యుల ఆగడాలపై స్థానిక పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేసినా ఫలితం ఉండటం లేదు. ఫైనాన్స్‌ కంపెనీల ఆగడాలపై 10 రోజుల కిందట లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయకపోవడం గమనార్హం. మాకు న్యాయం చేయమంటూ స్టేషన్‌కు వెళితే.. ‘వారిని పిలిపిస్తాం. రేపు రా, ఎల్లుండి రా..’ అంటూ పోలీసులు కాలయాపన చేస్తున్నట్లు సమాచారం. పైగా నిందితుల పట్ల పోలీసులు ఉదాసీనత ప్రదర్శిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ రికవరీ ఏజెన్సీల యాజమాన్యాల వెనుక అధికారపార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఉండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. దీంతో రికవరీ ఏజెంట్లపై కేసులు పెట్టిన బాధితులపైనే పోలీసులు ఉల్టా కేసులు నమోదు చేస్తామని బెదిరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇటీవల 2వ పట్టణ పోలీసు స్టేషన్‌లో కొందరు బాధితులు ఓ ప్రైవేట్‌ ఫైనాన్స్‌ కంపెనీకి చెందిన రికవరీ ఏజెంట్లపై ఫిర్యాదు చేస్తే.. అధికారపార్టీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి జోక్యం చేసుకుని నిందితులకు వత్తాసు పలికినట్లు తెలుస్తోంది.

రూటు మార్చేసి..
కాల్‌మనీ సెక్స్‌రాకెట్‌ గుట్టు రట్టు కావడం.. పోలీసులు కాల్‌మనీ రాకెట్‌లో పెద్ద చేపల్ని వదిలి చిన్న చేపల్ని పట్టుకోవడంతో ఊపిరి తీసుకున్న అధికారపార్టీ నేతల అండడండలున్న బడా వ్యాపారులు కొంత కాలంపాటు తమ కార్యకలాపాలను పక్కనపెట్టేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. నాలుగేళ్లు గడిచాయి.. మళ్లీ ఇప్పుడు కాల్‌మనీ వ్యాపారులు కొత్త అవతారం ఎత్తి.. ఫైనాన్స్‌ కంపెనీలు బకాయిల వసూళ్ల కోసం నియమించుకునే రికవరీ ఏజెన్సీల యజమానులుగా రూపాంతరం చెందారు. ఇప్పుడు వారి వద్ద పనిచేస్తున్న ఏజెంట్లు ఫైనాన్స్‌ కంపెనీలకు, బ్యాంకులకు సరిగా బకాయిలు చెల్లించని వినియోగదారులను టార్గెట్‌గా చేసుకుని రెచ్చిపోతున్నారు. ఒకప్పుడు రూ. 20 వడ్డీ వ్యాపారం నిర్వహించే కాల్‌మనీ వ్యాపారులు.. ఇప్పుడు బకాయి వసూలు చేసి ఇస్తే అధికారికంగా రూ. 100కి 20 శాతం కమీషన్‌  వస్తుండటంతో ఈ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.

కఠిన చర్యలు తీసుకుంటాం
కాల్‌మనీ వ్యాపారాలను సహించం. ఫైనాన్స్‌ కంపెనీ రికవరీ ఏజెంట్లు వినియోగదారుల పట్ల అమర్యాదగా ప్రవర్తించరాదు. బకాయిల వసూళ్ల కోసం బెదిరింపులకు, లైంగిక వేధింపులకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తాం.    – ద్వారకాతిరుమలరావు, నగర సీపీ

మరిన్ని వార్తలు