విజయవాడలో రెచ్చిపోతున్న గంజాయి గ్యాంగ్‌లు

12 Jun, 2018 11:42 IST|Sakshi

ఐటీఐ కాలేజీ ఆవరణలో మితిమీరుతున్న గంజాయి ముఠాల ఆగడాలు

కమీషనర్ గౌతమ్‌ సవాంగ్‌కు ఎన్నారై ఫిర్యాదు

సాక్షి, విజయవాడ : విజయవాడలో విద్యార్థులే లక్ష్యంగా గంజాయి గ్యాంగ్‌లు రెచ్చిపోతున్నాయి. మాచవరం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జోరుగా అక్రమ దందా సాగిస్తున్నాయి. వీరిపై స్థానికులు పలుసార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో విద్యార్థులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు. పోలీసుల తీరుతో విసుగు చెందిన ఎన్నారై నూతక్కి నాగేశ్వరరావు అమెరికా నుంచి నేరుగా నగర పోలీస్‌ కమీషనర్‌ గౌతమ్‌ సవాంగ్‌కు ఈమెయిల్‌ ద్వారా ఫిర్యాదు చేశారు. 

నగరంలోని మాచవరం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఐటీఐ కాలేజీ ఆవరణలో గంజాయి గ్యాంగ్‌లు గుట్టు చప్పుడు కాకుండా అమ్మకాలు సాగిస్తున్నాయని ఎన్నారై తన ఫిర్యాదులో పేర్కొన్నారు. 13 నుంచి 15 ఏళ్లలోపు వారిని లక్ష్యంగా చేసుకొని దారుణాలకు పాల్పడుతున్నట్లు వెల్లడించారు. మరికొన్ని సార్లు ముఠాలు శ్రుతిమించిపోతున్నాయని, విద్యార్థుల నుంచి ఫోన్‌లు, బ్యాగ్‌లు, పుస్తకాలతో పాటు ఇతర వస్తువులు గుంజుకొని రౌడీయిజానికి పాల్పడుతున్నారని తెలిపారు. స్టూడెంట్ జీవితాలతో చెలగాటమాడుకొనే ఈ గ్యాంగ్‌లకు ఆరుమెల్లి రామకృష్ణ అనే వ్యక్తి అండగా ఉన్నరని ఎన్నారై తన ఫిర్యాదులో ఆరోపించారు.

ఒక్కోసారి వీధుల్లో ఈ గ్యాంగ్‌లు అల్లర్లకు పాల్పడుతూ స్థానికులను వేధిస్తున్నాయని ఎన్నారై తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వీధుల్లో గంజాయి అమ్ముతూ, వద్దన్న వారిపై కత్తులు, బ్లేడ్‌లతో దాడులకు దిగుతున్నారని, విద్యార్థులు అటుగా పాఠశాలలకు, కళాశాలలకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడిందని వెల్లడించారు. ఇదంతా మాచవరం పోలీస్‌ స్టేషన్‌కు కూతవేటు దూరంలో జరుగుతున్నా పోలీసులు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, సమస్యను వెంటనే పరిష్కరించాలని సవాంగ్‌ను కోరారు. ఈ మేరకు గ్యాంగ్‌లకు సంబంధించిన పూర్తి వివరాలు, పేర్లు వారి ఫోన్‌ నెంబర్లతో సహా కమీషనర్‌కు ఫిర్యాదు చేశారు.

మరిన్ని వార్తలు