ఓట్ల తొలగింపు ముఠా పట్టివేత

13 Nov, 2018 05:06 IST|Sakshi
సర్వే బృందం వద్ద ఉన్న టీడీపీ గుర్తింపు కార్డు, స్పా సంస్థ పేరుతో ఉన్న కార్డు

     తూర్పుగోదావరి గ్రామాల్లో పథకం ప్రకారం వైఎస్సార్‌సీపీకి చెందిన వారి ఓట్ల తొలగింపు

     అనధికారిక సర్వే చేస్తూ దొరికిన టీడీపీ గుర్తింపు కార్డు కలిగిన యువకులు

     పోలీసులకు అప్పగించిన వైఎస్సార్‌సీపీ నేతలు

అంబాజీపేట/రాజోలు: అనధికారికంగా సర్వే చేస్తూ పథకం ప్రకారం వైఎస్సార్‌సీపీకి చెందినవారి ఓట్లను తొలగిస్తున్న బృందాన్ని తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు సోమవారం అడ్డుకున్నాయి. అంబాజీపేట, రాజోలు మండలాల్లోని మాచవరం, వాకలగరవు గ్రామాలకు రెండు బృందాలుగా 11 మంది యువకులు చేరుకుని అనధికారికంగా సర్వే చేపట్టారు. మాచవరం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద అనుమానాస్పందంగా సంచరిస్తున్న ఆరుగురు యువకులను వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి నాగవరపు నాగరాజు, మట్టా వెంకటేశ్వరరావు, కొర్లపాటి కోటబాబు, మైలా ఆనందరావు, జనసేన నాయకుడు శిరిగినీడి వెంకటేశ్వరరావు తదితరులు గుర్తించి నిలదీశారు. యువకులు ‘సోషియో పొలిటికల్‌ ఎనాలిసిస్‌’ (స్పా) సంస్థ నుంచి వచ్చామన్నారు. పి.గన్నవరం నియోజకవర్గ పరిధిలో 4 మండలాల్లో సర్వే చేసేందుకు 60 మంది బృందంగా ఏర్పడినట్లు తెలిపారు.
ఓట్లు తొలగించే బృందంపై ఫిర్యాదు చేస్తున్న వైఎస్సార్‌ సీపీ నేతలు 

టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధి, పథకాలు, ఏ పార్టీకి ఓటు వేస్తారనే అంశాలపై అభిప్రాయాలను సేకరిస్తున్నామన్నారు. గుర్తింపు కార్డులు చూపించాలని అడగడంతో.. జి.సాయి, గణేష్, నరేంద్ర, రాహుల్, మణికంఠ, వెంకటేశ్వరరావుగా పేర్లు చెప్పుకున్న వ్యక్తులు పొంతనలేని సమాధానాలిచ్చారు. అనుమానం వచ్చి టీడీపీకి అనుకూలంగా లేని ఓట్లను సర్వే పేరుతో తొలగిస్తున్నారని బృంద సభ్యులను నిలదీయగా వారి వద్ద నుంచి సమాధానం లేదు. దీంతో అంబాజీపేట పోలీస్‌ స్టేషన్‌కు బృంద సభ్యులను అప్పగించి ఫిర్యాదు చేశారు.

వైఎస్సార్‌సీపీ కోఆర్డినేటర్‌ కొండేటి చిట్టిబాబు పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి బృంద సభ్యుల నుంచి సర్వేపై ఆరా తీయగా తాటిపాకలోని సాయితేజ లాడ్జిలో సూపర్‌ వైజర్లు ఉన్నారని సమాధానమిచ్చారు. లాడ్జిని తనిఖీ చేయగా 11 మంది ‘స్పా’ సభ్యులు ఉన్నట్లు గుర్తించారు. వారి వద్ద టీడీపీ సభ్యత్వ గుర్తింపు కార్డులు, ల్యాప్‌ట్యాప్, ట్యాబ్‌లు బయటపడ్డాయి. అంబాజీపేట మండలం వాకలగరువులో సర్వే పేరుతో తిరుగుతున్న మరో ఆరుగురిని పార్టీ నాయకులు పట్టుకొని స్టేషన్‌కు తరలించారు. కాగా, పట్టుకున్నవారిని విడిచిపెట్టాలంటూ అధికార పార్టీ నేతల నుంచి పోలీసులపై ఒత్తిళ్లు మొదలయ్యాయి. 

మరిన్ని వార్తలు