విధి వక్రించింది

11 Feb, 2019 10:36 IST|Sakshi
సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న డీఎస్పీ లక్ష్మీనారాయణ, పోలీసులు, గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి, విజయ మృతదేహాలు  

కామారెడ్డి క్రైం: మరి కాసేపట్లో బంధువు పెళ్లికి హాజరై అందరితో సరదాగా గడపాలనుకున్నారు. అంతలోనే ఘోర రోడ్డు ప్రమాదం రూపంలో వారిని మృత్యువు కబళించింది. కామారెడ్డి మండలం పొందుర్తి వద్ద జాతీయ రహదారిపై అదుపు తప్పిన కారును డీసీఎం ఢీకొట్టిన సంఘటనలో దంపతులు అక్కడికక్కడే మృతిచెందగా ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఆదివారం సాయంత్రం ఈ సంఘటన వారి కుటుంబంలో విషాదాన్ని మిగిల్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. నిజామాబాద్‌కు చెందిన గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి(65) హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తూ దూలపల్లిలో ఇల్లు కొనుక్కుని అక్కడే స్థిరపడ్డాడు.

ఆదివారం దగ్గరి బంధువుల ఇంట్లో నిశ్చితార్థం ఉండడంతో అతడి భార్య విజయ(60), మరికొందరు నిజామాబాద్‌కు వచ్చారు. సాయంత్రం 7 గంటలకు హైదరాబాద్‌లో మరో బంధువుల వివాహం ఉండడంతో కారులో తిరుగు ప్రయాణమయ్యారు. పొందూర్తి వద్దకు రాగానేవారు ప్రయాణిస్తున్న కారు టైరు పేలింది. అదుపుతప్పిన కారు రోడ్డుకు అవతలి వైపు వెళ్లడంతో హైదరాబాద్‌ వైపు నుంచి నిజామాబాద్‌ వైపు వేగంగా వెళ్తున్న డీసీఎం వాహనం ఢీకొంది. వారు ప్రయాణిస్తున్న ఫోర్డ్‌ కారు నుజ్జునుజ్జయ్యింది. ఈ ప్రమాదంలో చంద్రశేఖర్‌రెడ్డి, విజయ దంపతులు అక్కడికక్కడే మృతిచెందారు. కారులో ప్రయాణిస్తున్న విజయ చెల్లెలు ప్రేమల, ప్రేమల కుమారుడు నిఖిల్‌రెడ్డి, విజయ అన్న భార్య అయిన సవితకు తీవ్రంగా గాయాలయ్యాయి. వారిని వెంటనే 108లో కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు. సవిత పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం వైద్యులు హైదరాబాద్‌కు సిఫారసు చేశారు.
 
సంఘటన స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ 
ఘటనా స్థలాన్ని కామారెడ్డి డీఎస్పీ లక్ష్మీనారాయణ, పోలీసులు సందర్శించారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. కారులో ఇరుక్కున్న వారిని స్థానికుల సహకారంతో బయటకు తీయించారు. దంపతుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు.
 
మృత్యువులోనూ ఒకటిగానే... 
వివాహ బంధంతో ఒక్కటైన దంపతులు కలిసి జీవించడమే కాకుండా మృత్యువులోనూ ఒక్కటిగా కలిసి వెళ్లిపోయారు. ప్రమాద బాధితులందరూ దాదాపుగా ఒకే కుటుంబానికి చెందినవారు. విషయం తెలియగానే ఇతర వాహనాలు, బస్సుల్లో అదే వివాహానికి హాజరయ్యేందుకు హైదరాబాద్‌ వెళ్తున్న మిగతా బంధువులు కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలివచ్చారు. బాధితులంతా ఒకే కుటుంబానికి చెందిన దగ్గరి బంధువులు కావడం వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. మృతులు చంద్రశేఖర్‌రెడ్డి, విజయకు  ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. వారు హైదరాబాద్, గుల్బర్గా ప్రాంతాల్లో ప్రైవేట్‌ ఉద్యోగాల్లో ఉన్నట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు