నమ్మకంగా దోచేశాడు 

21 Jan, 2020 08:23 IST|Sakshi

యజమాని ఇంటిలో దొంగతనానికి పాల్పడిన కారు డ్రైవర్‌ అరెస్ట్‌  

21 తులాల బంగారం, రూ.4.49 లక్షల నగదు స్వాధీనం 

వివరాలు వెల్లడించిన నగర డీసీపీ – 2  ఉదయ్‌ భాస్కర్‌ బిల్లా 

సాక్షి, విశాఖపట్నం: కంచరపాలెం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ ఇంటి యజమాని వద్ద కారు డ్రైవర్‌గా నమ్మకంగా పనిచేస్తూ... అదే ఇంటిలో బంగారం, నగదు దొంగతనానికి పాల్పడిన నిందితుడిని అరెస్ట్‌ చేసినట్లు నగర డీసీపీ – 2 ఉదయ్‌భాస్కర్‌ బిల్లా తెలిపారు. 21 తులాల బంగారం, రూ.4.49 లక్షల నగదు స్వాదీనం చేసుకున్నామని తెలిపా రు. నగర పోలీస్‌ కాన్ఫరెన్స్‌ హాల్లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన తెలిపిన వివరాల ప్రకారం... కంచరపాలెం పి.ఆర్‌.గార్డెన్స్‌లో గల శ్రీరామ్‌ అపార్టుమెంట్స్‌లో రిటైర్డ్‌ చార్టెడ్‌ అకౌంటెంట్‌ పేరి గోపాలకృష్ణ(78) భార్యతో కలిసి నివాసముంటున్నారు. కంచరపాలెం కోకో కంపెనీ వెనుక నివాసముంటున్న సత్యనారాయణ(36) అనే వ్యక్తిని నెలకు రూ.10వేలు వేతనమిస్తూ కారు డ్రైవర్‌గా పెట్టుకున్నారు. సత్యనారాయణ నమ్మకంగా పనిచేస్తూ కొన్నాళ్లకు ఇంటిలో మనిíÙలా వ్యవహరించేవాడు. గోపాలకృష్ణ పిల్లలిద్దరూ అమెరికాలో స్థిరపడటంతోపాటు ఆర్థికంగా స్థిరపడిన కుటుంబం కావడంతో ఇంట్లో నగదు, బంగారు ఆభరణాల విషయంలో పెద్దగా పట్టించుకునేవారు కాదు. ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ నగదు పెట్టడం, తాళాలను ఒక కబోర్డులో ఉంచడాన్ని సత్యనారాయణ గమనించాడు.

ఈ నేపథ్యంలో గత ఏడాది నవంబర్‌ నెలలో గోపాలకృష్ణ దంపతులకు అనుమానం రాకుండా ఇంట్లో నుంచి సుమారు 21 తులాల బంగారు ఆభరణాలు, రూ.4.49 లక్షల నగదు దోచుకున్నాడు. తర్వాత డ్రైవర్‌ వృత్తిని విడిచిపెట్టి వెళ్లిపోయాడు. అనంతరం ఈ ఏడాది జనవరి మొదటి వారంలో ఇంటిలోని బంగారం కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన గోపాలకృష్ణ కంచరపాలెం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సత్యనారాయణపై అనుమానం ఉన్నట్లుగా ఫిర్యాదులో పేర్కొనడంతో ఏడీసీపీ(క్రైం) వి.సురేష్‌బాబు నేతృత్వంలో ఏసీపీ(క్రైం) సీహెచ్‌ పెంటారావు, పశి్చమ సబ్‌ డివిజన్‌ సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ మన్మధరావు, కానిస్టేబుల్‌ సుధాకర్, నవీన్, అప్పలరాజులతో కూడిన బృందం దర్యాప్తు ప్రారంభించారు. సత్యనారాయణపై అనుమానంతో గాలింపు చర్యలు చేపట్టారు. ఎస్‌.కోటలో ఉన్నట్లు సమాచారం అందడంతో అక్కడకు వెళ్లి అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా దొంగతనం చేసినట్లు అంగీకరించడంతో అరెస్టు చేశారు. గోపాలకృష్ణ నివాసముంటున్న అపార్టుమెంట్‌లోని ఇళ్లలో కూడా చిన్న చిన్న దొంగతనాలు చేసినట్లుగా విచారణలో సత్యనారాయణ అంగీకరించాడని, ఆ వివరాలు పూర్తిస్థాయిలో ఇంకా సేకరించాల్సి ఉందని డీసీపీ ఉదయ్‌భాస్కర్‌ తెలిపారు.  

మరిన్ని వార్తలు