ఫ్లైఓవర్‌ పైనుంచి కారు బోల్తా

19 Feb, 2020 03:32 IST|Sakshi
కూలిన ఫ్లైఓవర్‌ రెయిలింగ్, సోహెల్‌ (ఫైల్‌), నుజ్జునుజ్జయిన కారు

హైదరాబాద్‌: మితిమీరిన వేగం మరో ప్రాణాన్ని బలితీసుకుంది. హైదరాబాద్‌లో బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌ నుంచి కారు కింద పడిన ఘటన మరచిపోకముందే అలాంటిదే మరో ప్రమాదం చోటుచేసుకుంది. నగరంలోని భరత్‌నగర్‌ ఫ్లైఓవర్‌పైకి వేగంగా దూసుకొచ్చిన ఓ కారు.. అదుపుతప్పి కింద పడిపోయింది. ఈ ఘటనలో కారులో ఉన్న ఓ వ్యక్తి మృతిచెందగా మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం అర్ధరాత్రి 2.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో ఫ్లైఓవర్‌ కింద భరత్‌నగర్‌ మార్కెట్‌కు వచ్చిన కూరగాయల వ్యాపారులు, విద్యుత్‌ కేబుల్‌ కార్మికులు ఉన్నారు. అయితే, అదృష్టవశాత్తు కారు వారికి కాస్త దూరంగా పడటంతో పెద్ద ప్రమాదం తప్పినట్టయింది.  

30 అడుగుల ఎత్తు నుంచి... 
బోరబండ పండిట్‌ నెహ్రూనగర్, స్వరాజ్‌నగర్‌లకు చెందిన స్నేహితులు మహ్మద్‌ సోహెల్‌ (27), మెహిజ్‌ (19), గౌస్‌ (20), ఇర్ఫాన్‌ (18), అశ్వక్‌ (18) సోమవారం రాత్రి భోజనం చేయడానికి హైటెక్‌సిటీకి వెళ్లారు. సోహెల్‌ మామయ్యకు చెందిన హ్యుందాయ్‌ ఆక్సెంట్‌ కారు (ఏపీ 11ఆర్‌ 9189)ను సునీల్‌ (22) నడుపుతున్నాడు. భోజనం చేసిన తర్వాత అర్ధరాత్రి సమయంలో మూసాపేట నుంచి ఎర్రగడ్డ వైపు వస్తున్నారు. భరత్‌నగర్‌ ఫ్లైఓవర్‌పైకి వేగంగా వెళ్లిన కారు.. ఒక్కసారిగా అదుపు తప్పింది. అడుగున్నర ఎత్తున్న ఫుట్‌పాత్‌ ఎక్కి, అంతటితో ఆగకుండా రెయిలింగ్‌ను ఢీకొట్టి 30 అడుగుల ఎత్తు నుంచి కిందకు పడిపోయింది.

పెద్ద శబ్దంతో కారు కింద పడటంతో అక్కడ ఉన్న కూరగాయల వ్యాపారులు, విద్యుత్‌ కేబుల్‌ కార్మికులు ఏం జరిగిందో తెలియక భయాందోళనతో పరుగులు తీశారు. అనంతరం తేరుకుని కారు వద్దకు చేరుకున్నారు. జేసీబీ సాయంతో కారు రేకులు తొలగించి అం దులో ఉన్న ఆరుగురిని బయటకు తీశారు. ఈ ఘటనలో డ్రైవర్‌ పక్క సీట్లో కూర్చున్న సోహెల్‌ అక్కడికక్కడే మృతి చెందగా.. మిగతా ఐదుగురు గాయపడ్డారు. మృతుడు సోహెల్‌ తండ్రి షఫీ చాయ్‌ హోటల్‌ నడుపుతున్నారు. అశ్వక్, ఇర్ఫాన్, మొహిజ్‌లు స్వరాజ్‌నగర్‌లో ఏసీ రిపేరింగ్‌ పనులు చేస్తుంటారు. గౌస్‌ అల్మారా పనులు చేస్తుండగా.. సునీల్‌ లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. గాయపడిన వారికి ఎలాంటి ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.  

మరిన్ని వార్తలు