పెద్దల పేకాట అడ్డా !

24 Apr, 2019 11:38 IST|Sakshi

జొన్నా లాడ్జిలో రూ.లక్షల్లో పేకాట

లాడ్జి నిర్వాహకుల అండతోనే నిర్వహణ

చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న పోలీసులు

కదిరి: కదిరి పట్టణ నడిబొడ్డున ఆర్టీసీ బస్టాండ్‌కు పక్కనే ఉన్న తెలుగుదేశం పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే జొన్నా రామయ్యకు సంబంధించిన జొన్నా లాడ్జిలో పేకాట జోరుగా సాగుతోంది. ఆ లాడ్జిలో బస చేసే వారు కరువైనందున దాన్ని ఎన్నికల సమయంలో టీడీపీ కార్యాలయంగా మార్చారు. సార్వత్రిక ఎన్నికలు ఈ నెల 11న ముగియడంతో 12వ తేదీ నుంచి ఆ లాడ్జిని పేకాట అడ్డాగా మార్చారు. ఈ విషయం పలుమార్లు స్థానిక పోలీసు అధికారులకు కొందరు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో, వారు నేరుగా డయల్‌ 100కు సమాచారం ఇవ్వడంతో అప్పుడు స్థానిక పోలీసు అధికారుల్లో చలనం వచ్చింది. విధిలేని పరిస్థితుల్లో లాడ్జిపై దాడులు నిర్వహించారు. అక్కడ పేకాట ఆడుతున్న 12 మందిని అరెస్ట్‌ చేసి వారి నుండి రూ54,500 స్వాధీనం చేసుకున్నారు.

పెద్దల అండతోనే పేకాటజరుగుతోందా?
జొన్నా లాడ్జి యజమాని జొన్నా రామయ్య ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన విషయం విదితమే. అప్పుల భారంతో ఆయన తమ లాడ్జిని అమ్మకానికి కూడా పెట్టారు. టీడీపీలో చేరి తన గెలుపునకు సహకరిస్తే లాడ్జి అమ్మకుండా ఆ డబ్బు సర్దుబాటు చేసే బా«ధ్యత తనదేనని చెప్పడంతోనే ఆయన టీడీపీలో చేరినట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీడీపీ పెద్దల అండతోనే ఆ లాడ్జిలో పేకాట పెద్ద మొత్తంలో జరుగుతున్నట్లు బహిరంగంగా చర్చించుకుంటున్నారు. స్థానికులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి సైతం అక్కడికి పేకాట ఆడేందుకు  వస్తున్నారని, డబ్బులు పెద్ద మొత్తంలో పోగొట్టుకున్న వారే పోలీసులకు సమాచారం చేరవేస్తున్నారని తెలుస్తోంది.

అసలు నాయకులను తప్పించారా?
రెండు రోజుల క్రితం జొన్నా లాడ్జిలోని పేకాట స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించినప్పుడు అధికార టీడీపీకి చెందిన కొందరు ప్రముఖ నాయకులను తప్పించినట్లు ఆరోపణలు విన్పిస్తున్నాయి. పెద్ద మొత్తంలో నగదు లభిస్తే కేవలం రూ.54,500 మాత్రమే కోర్టు దృష్టికి తెచ్చారని, మిగిలిన సొమ్మును పోలీసు అధికారులు స్వాహా చేశారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. లాడ్జిలో జరుగుతున్న పేకాటను నివారించకపోతే  అక్కడ హత్యలకు దారితీసినా ఆశ్చర్య పోనక్కర లేదని కొందరంటున్నారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు