ప్రాణం మీదకు తెచ్చిన పేకాట

30 May, 2019 07:20 IST|Sakshi
యువకుడిని కాపాడుతున్న అధికారులు

ఇంద్రకీలాద్రిపై నిషేధిత ప్రాంతంలో  పేకాట

అదుపు తప్పి కిందకు జారిన ఓ యువకుడికి గాయాలు

ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై నిషేధిత ప్రాంతంలో పేకాట ఆడుతున్న ఓ యువకుడి ప్రాణాల పైకి తెచ్చింది. ఇద్దరు యువకులు పరారీ కాగా మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. మల్లికార్జునపేటకు చెందిన నలుగురు ఇంద్రకీలాద్రి కొండపైకి ఎక్కి పేకాట ఆడుతున్నారు. సాయంత్రం 3–30 గంటల సమయంలో అమ్మవారి ఆలయం కొండపై ఉన్న వాటర్‌ ట్యాంక్‌ మీదుగా కొండ శిఖరానికి చేరుకున్నారు. నిశ్చయ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేయడంతో ప్రత్యేక పోలీసుల బలగాలు కొండ శిఖరం పైకి చేరుకుని భద్రతను పర్యవేక్షించారు.

ఇదే సమయంలో ఇద్దరు యువకులు పోలీసు బలగాలను చూసి పరార్‌ కాగా, మరో యువకుడు కొండ దిగేందుకు ప్రయత్నించాడు. అయితే పట్టు తప్పడంతో చెట్టును పట్టుకుని వేలాడసాగాడు.  భద్రత పర్యవేక్షిస్తున్న పోలీసులు ఆ యువకుడి రక్షించే ప్రయత్నం చేయగా, ఆ యువకుడు చేయి వదిలేశాడు. దీంతో ఆ యువకుడు కొండపై నుంచి కిందకు జారిపడ్డాడు. జారిపడిన యువకుడు మద్యం మత్తులో ఉండటంతో చిన్న పాటి గాయాలయ్యాయి. వెంటనే పోలీసులు ఆ యువకుడిని ఆస్పత్రికి తరలించారు. మరో యువకుడిని పోలీసుల బలగాలు అదుపులోకి తీసుకుని వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.  పోలీసులు విచారణ చేపట్టారు. 

మరిన్ని వార్తలు