పథకం ప్రకారమే కేర్‌ టేకర్‌గా చేరి.. 

27 May, 2018 07:00 IST|Sakshi

తిరుమలగిరి వృద్ధురాలి హత్యకేసును ఛేదించిన టాస్క్‌ఫోర్స్‌ 

కేర్‌టేకర్‌ అరుణ్, స్నేహితురాలు సరస్వతే హత్య చేశారు 

నిందితులిద్దరితో పాటు, నిందితుడి తల్లి కూడా అరెస్ట్‌ 

హిమాయత్‌నగర్‌ : కేర్‌ టేకర్‌గా చేరి వృద్ధురాలిని హత్య చేసిన ఘటనలో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ కేసులో పోలీస్‌శాఖ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఎనిమిది టీంలతో పనిచేసిందని, హత్య అనంతరం అక్కడ కాజేసిన బంగారం, వెండి ఆభరణాలతో ఉడాయించిన నిందితుల్ని ఎట్టకేలకు పట్టుకుని అరెస్టు చేసినట్లు నగర కొత్వాల్‌ అంజనీకుమార్‌ వెల్లడించారు. టాస్క్‌ ఫోర్స్‌ డీసీపీ రాధకృష్ణరావు నేతృత్వంలోని టీం ఎంతో చాకచక్యంగా ఈ ఘటనలో ఇద్దరు నిందితులతో పాటు నిందితుడి తల్లిని కూడా అరెస్టు చేసినట్లు వివరించారు. వీరి నుంచి 4 తులాల గోల్డ్‌ నెక్లెస్, తులం చెవి దుద్దులు, తులం గోల్డ్‌ కాయిన్, 10 తులాల వెండి పట్టీలు, 2 సెల్‌ఫోన్లు, రూ.5 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. శనివారం పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమిషనర్‌ అంజనీకుమార్‌ మాట్లాడుతూ తిరుమలగిరిలోని కమల లయ ఎన్‌క్లేవ్‌లో జి.సులోచన (66), భర్త కాంతరావు(72) నివాసం ఉంటున్నా రు. భర్త కాంతరావు పెరాలసిస్‌తో బెడ్‌ రెస్ట్‌లో ఉన్నారు. వీరికి కేర్‌ టేకర్‌ అవసరమని గత నెలలో పేపర్‌లో ప్రకటన ఇచ్చారు. ప్రకటన ఆధారంగా నిజమాబాద్‌ జిల్లా, సుద్దపల్లి గ్రామానికి చెందిన నిధి అరుణ్‌(29) 7వ తేదీన కేర్‌టేకర్‌గా చేరాడు.  

ప్లాన్‌తోనే చేరాడు 
వృద్ధులకు కేర్‌ టేకర్‌గా అంటే ఆస్తి అంతా కాజేయవచ్చు అనే ఆలోచనతోనే చేరినట్లు పోలీసులు నిర్ధారించారు. అరుణ్‌ వ్యవహారశైలిలో అనుమానాలు రావడంతో సులోచన తన కుమారుడికి చెప్పింది. కొద్దిరోజులు ఓపిక పట్టమని అన్నాడు. కేర్‌ టేకర్‌ను మార్చేద్దామని హామీ ఇచ్చాడు. ఈ మాటలు విన్న అరుణ్‌ ఈ నెల 18వ తేదీన నిజామాబాద్‌ జిల్లా మెట్రస్‌పల్లికి చెందిన పరిచయస్తురాలు మాచర్ల సరస్వతిని నగరానికి తీసుకొచ్చాడు.  

పథకం ప్రకారం చేశారు 
రాత్రి 7.30గంటలకు తిరుమలగిరిలోని అపార్ట్‌మెంట్‌కు తీసుకొచ్చి బయట మెట్లపై సరస్వతిని కూర్చోబెట్టి అరుణ్‌ ఇంట్లోకి వెళ్లాడు. రాత్రి 10.30గంటలకు సులోచన, కాంతరావు నిద్రపోయారు. ఆ తరువాత సరస్వతిని ఇంట్లోకి తీసుకొచ్చి ఒకే గదిలో రెండు గంటల పాటు ఉన్నారు. రాత్రి 12.30గంటల తరువాత అరుణ్‌ దిండు తీసుకుని సులోచన ముఖంపై పెట్టి నులుముతుండగా ఆమె కాళ్లను సరస్వతి పట్టుకుంది. ఐదు నిమిషాల్లోనే సులోచన ప్రాణాలు కోల్పోయింది. ఆమె చనిపోలేదేమోననే అనుమానంతో వంటగది లో ఉన్న కత్తిని తీసుకుని కడుపులో బలంగా పొడి చాడు అరుణ్‌. దీంతో తీవ్ర రక్తస్రావం అయ్యింది. రక్తం ఎక్కువగా రావడంతో పౌడర్‌ చల్లారు. ఆ తరువాత సులోచన మెడలో ఉన్న బంగారు ఆభరణాలు, ఇంట్లోని వెండి, నగదును తీసుకుని కవర్‌లో పెట్టుకున్నారు. అప్పటికప్పుడు వెళితే అనుమానం వస్తుందని భావించిన వీరు తెల్లవారు జా మున 3.30గంటల ప్రాంతంలో బంగారం, నగ దు, వెండిని తీసుకుని పారిపోయారు. ఇక్కడ దొంగలించిన బంగారు, వెండి ఆభరణాలు, నగదును తీసికెళ్లి అరుణ్‌ తన తల్లి రాజమణికి ఇచ్చాడు. నగరంతో పాటు, నిజామాబాద్‌ ప్రాం తాల్లో వీరు అమ్మిన బంగారు ఆభరణాల ద్వారా పోలీసులను వీరిని గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించారు. దీంతో అరెస్టు చేసినట్లు అంజనీకుమార్‌ తెలిపారు.  

గతంలోనూ హత్య చేశాడు 
అరుణ్‌పై గతంలో నిజమాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ పోలీస్‌స్టేషన్‌లో హత్య కేసు నమోదైంది. 2016లో ఓ వ్యక్తిని చంపి, రూ.5వేలు కాజేసి పరారయ్యా డు. నిజమాబాద్‌ రూరల్‌ పోలీస్‌స్టేషన్‌లో బైకు దొంగిలించిన కేసులో ఇతడిపై కేసు నమోదైంది.  

సిబ్బందిని అభినందించిన సీపీ 
కేసును త్వరతగతిన పరిష్కరించినందుకు కమిషనర్‌ అంజనీకుమార్‌ టాస్క్‌ఫోర్స్‌ సిబ్బందిని ప్రత్యేకంగా అభినందించారు. డీసీపీ రాధకృష్ణరావు, ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వరరావు, ఎస్‌ఐలు చంద్రశేఖర్‌రెడ్డి, రవి, శ్రీకాంత్, శ్రవణ్‌ను ప్రత్యేకంగా అభినందించారు.   

మరిన్ని వార్తలు