ఇక సీబీఐ చేతికి..

16 Jun, 2018 11:41 IST|Sakshi
ఆర్‌ఈసీఎస్‌ ప్రధాన కార్యాలయం 

ఆర్‌ఈసీఎస్‌ కుంభకోణంపై  విచారణ

ఆంధ్రాబ్యాంక్‌ క్లర్క్‌పై కేసు  నమోదు

చీపురుపల్లి విజయనగరం : గ్రామీణ విద్యుత్‌ సహకార సంఘం (ఆర్‌ఈసీఎస్‌)లో వినియోగదారుల డబ్బు రూ.1.71 కోట్లు పక్కదోవ పట్టిన వ్యవహారం సీబీఐ చేతికి చేరింది. నిధులు గల్లంతైన విషయమై ఇంతవరకు ఆంధ్రాబ్యాంకులో ఉన్నత స్థాయి విజిలెన్స్‌ విచారణ పూర్తి చేసుకున్న అనంతరం కేసు సీబీకి అప్పగించారు.

స్థానిక ఆంధ్రాబ్యాంకులో 2015 జూలై నుంచి 2017 జూలై వరకు క్యాషియర్‌గా పని చేసిన వి.సంతోషిరాము ఆ నిధుల గల్లంతుకు ప్రధాన కారకుడిగా గుర్తించి సీబీఐ కేసు నమోదు చేసినట్లు తెలిసింది. దీంతో సీబీఐ అధికారులు సంతోషిరాము నివాసం, ఆర్‌ఈసీఎస్‌ ప్రధాన కార్యాలయానికి వచ్చి విచారణ ప్రారంభించినట్లు సమాచారం.

అంతేకాకుండా ప్రస్తుతం పర్లాకిమిడిలో అసిస్టెంట్‌ మేనేజర్‌గా విధులు నిర్వహిస్తున్న సంతోషిరాము నివాసంలో పలు పత్రాలను సీబీఐ అధికారులు సీజ్‌ చేసినట్లు తెలిసింది. అలాగే ఆర్‌ఈసీఎస్‌ ప్రధాన కార్యాలయానికి వచ్చి పలు ఓచర్లు తీసుకెళ్లారు.

ఆర్‌ఈసీఎస్‌ పరిధిలో గల చీపురుపల్లి, గరివిడి, మెరకముడిదాం మండలాల్లో వినియోగదారులు నుంచి విద్యుత్‌ బిల్లుల రూపంలో వసూలు చేసి ఆ డబ్బును ప్రతిరోజూ ఆంధ్రాబ్యాంకులో ఉన్న ఆర్‌ఈసీఎస్‌ ఖాతాలో జమ చేస్తుంటారు.

అలా జమ చేసిన డబ్బులో 133 ఓచర్లకు సంబంధించిన రూ.1.71 కోట్లు డబ్బు ఆంధ్రాబ్యాంకులో ఉన్న క్యాషియర్‌ సంతోషి రాము జమ చేయకుండా పక్కదారి పట్టించాడు. 2017 ఏప్రిల్, మే, జూన్, జూలై నెలలో జరిగిన నిధుల గల్లంతు విషయాన్ని ఆర్‌ఈసీఎస్‌ అధికారులు అత్యంత ఆలస్యంగా 2018 మార్చిలో గుర్తించారు.

దీంతో ఆర్‌ఈసీఎస్‌ అధికారుల ఫిర్యాదు మేరకు ఆంద్రాబ్యాంక్‌ అధికారులు విచారణ చేపట్టి డబ్బులు గల్లంతైన విషయాన్ని  రెండు నెలలు తరువాత గుర్తించి సీబీఐకి కేసు అప్పగించారు. 

ఆర్‌ఈసీఎస్‌ అధికారులను విచారించనున్న సీబీఐ....

 వినియోగదారుల నుంచి వసూలు చేసే డబ్బు ప్రతిరోజూ బ్యాంకుకు జమ చేసిన వ్యవహారానికి సంబంధించి ఆర్‌ఈసీఎస్‌ ఉద్యోగులను సీబీఐ విచారించనున్నట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే నలుగురు ఆర్‌ఈసీఎస్‌ సిబ్బందిని సస్పెండ్‌ చేశారు. ఇదిలా ఉంటే సీబీఐ అధికారులు పట్టణానికి వచ్చి విచారణ చేపట్టడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు.

అధికారులు వచ్చారు....

సీబీఐ అధికారులు ఆర్‌ఈసీఎస్‌కు వచ్చారు. తమ సిబ్బంది ఆంధ్రాబ్యాంకులో జమ చేసిన డబ్బుకు సంబంధించిన ఓచర్లు అడిగారు. ఆంధ్రాబ్యాంకు ఉద్యోగి నివాసానికి కూడా వెళ్లినట్లు తెలిసింది. తమకు తెలిసిన పూర్తి సమాచారం ఇచ్చాం. – పి.రమేష్, ఎండీ, ఆర్‌ఈసీఎస్‌

మరిన్ని వార్తలు