క్రెడిట్‌ కార్డుతో రూ.లక్షలు కాజేసిన వ్యక్తిపై కేసు

6 Feb, 2020 11:24 IST|Sakshi

బంజారాహిల్స్‌: అత్యవసర పనిమీద క్రెడిట్‌ కార్డు వాడుకుంటానని నిమ్మించి నిమిషాల వ్యవధిలోనే లక్షలాది రూపాయలు కాజేసిన వ్యక్తిపై బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. బంజారాహిల్స్‌ రోడ్‌ నెం–12లోని ఎమ్మెల్యే కాలనీలో నివాసముంటున్న అచ్యుత్‌ వెంకట్‌ప్రసాద్‌ జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్‌లో ప్రాజెక్ట్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. గత నెల 31న ఆస్పత్రి వద్దకు వచ్చిన గుర్తుతెలియని వ్యక్తి ఆయనతో మాటలు కలిపాడు. కాసేపటి తర్వాత తనకు అత్యవసర పనిమీద క్రెడిట్‌ కార్డు అవసరముందని కాసేపట్లో మళ్లీ తిరిగి ఇస్తానంటూ ఆయన వద్దనుంచి యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డు తీసుకొని వెళ్లిపోయాడు.

అదే రోజు అర్ధరాత్రి దాటిన తర్వాత అచ్యుత్‌ వెంకట్‌ప్రసాద్‌ సెల్‌ఫోన్‌కు బ్యాంక్‌ నుంచి ఎస్‌ఎంఎస్‌ సందేశాలు వచ్చాయి. నాలుగు నిమిషాల వ్యవధిలో 17 లావాదేవీల్లో రూ.2.12లక్షలు ఖర్చు చేసినట్లు తెలిసింది. దీంతో అప్రమత్తమైన అచ్యుత్‌ వెంకటప్రసాద్‌ యాక్సిస్‌ బ్యాంక్‌ హెల్ప్‌లైన్‌ నంబర్‌కు ఫోన్‌చేసి క్రెడిట్‌ కార్డును బ్లాక్‌ చేయించాడు. మరుసటి రోజు ఉదయాన్నే బేగంపేటలోని యాక్సిస్‌బ్యాంక్‌ కార్యాలయంలో ఫిర్యాదు చేశాడు. ఈ లావాదేవీలకు సంబంధించిన వివరాలు సేకరించాడు. బ్యాంక్‌ అధికారుల సూచనలతో బుధవారం బంజారాహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు గుర్తుతెలియని వ్యక్తిపై 66సి. 66డి ఐటియాక్ట్‌ 2008 కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.   

మరిన్ని వార్తలు