జేఆర్‌పురం ఎస్‌ఐపై కేసు నమోదు

8 Jan, 2020 13:24 IST|Sakshi

వీఆర్‌లోకి పంపించిన పోలీసు ఉన్నతాధికారులు

మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించారని ఫిర్యాదు

ఫిర్యాదు మేరకుచర్యలకు ఉపక్రమించిన ఉన్నతాధికారులు

పోలీసు వర్గాల్లో చర్చనీయాంశం

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించారన్న అభి యోగంతో జేఆర్‌పురం పోలీస్‌స్టేషన్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ వి.అశోక్‌బాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన ఇంకా అదే స్టేషన్‌లో ఉంటే విచారణపై ప్ర భావం చూపుతుందన్న అభిప్రాయంతో యుద్ధ ప్రా తిపదికన ఎస్‌ఐను వీఆర్‌లోకి పంపించారు. ఇప్పుడి ది పోలీసు వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.  రణస్థలం మండలం పిశిని పంచాయతీకి చెందిన ఓ మహిళ జేఆర్‌పురం ఎస్‌ఐ అశోక్‌బాబుపై ఫిర్యాదు చేశారు. ఎస్‌ఐ తనను కారులో ఎక్కించుకుని, మత్తు మందు చల్లి, అత్యాచారానికి పాల్పడ్డారని టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేశారు. ఆ ఫోన్‌ నేరుగా తెలంగాణ పోలీసులకు వెళ్లిపోయింది. దీనిపై స్పందించిన అక్కడి పోలీసులు ఆంధ్రప్రదేశ్‌ టోల్‌ఫ్రీ నంబర్‌ ఇచ్చారు. దీంతో ఆమె నేరుగా మళ్లీ ఇక్కడి టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేసి ఎస్‌ఐ తనతో అసభ్యకరంగా ప్రవర్తించారని ఫిర్యాదు చేశారు.

అంతేకాకుండా సోమవారం శ్రీకాకుళంలో జరిగిన స్పందనలో ఎస్పీకి కూడా నేరుగా ఫిర్యాదు చేశారు. దీంతోపాటు స్థానిక మహిళా పోలీసు స్టేషన్‌లో కూడా కంప్లయింట్‌ ఇచ్చారు. ఒక భూమి విషయంలో ప్రకృతి లేఅవుట్‌ యజమానికి, తన కుటుంబానికి మధ్య వివాదం నడుస్తోందని, అందులో ఎస్‌ఐ, గ్రామ పెద్దల సమక్షంలో ఇరువర్గాల మధ్య లావాదేవీల ఒప్పందం జరిగిందని, అందులో కొంత మొత్తం లేఅవుట్‌ యజమాని ఇవ్వగా మిగతా మొత్తాన్ని చెల్లించే విషయంలో తాత్సారం చేస్తున్నారని, అదే విషయాన్ని ఎస్‌ఐకి, గ్రామ పెద్దలకు మళ్లీ ఫిర్యాదు చేశానని మహిళ చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఒక రోజు ఎస్‌ఐ దారిలో తనను చూసి కారులో ఎక్కమని పిలిచారని, ఎక్కిన తర్వాత మత్తు మందు చల్లి అత్యాచారానికి యత్నించారని ఆ మహిళ ఫిర్యాదులో పేర్కొన్నారు. మొత్తానికి మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసు ఉన్నతాధికారులు సోమవారం రాత్రి ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. విచారణపై ప్రభావం చూపొచ్చని అక్కడి నుంచి తప్పించి వీఆర్‌లోకి పంపించారు. ఆయన స్థానంలో లావేరు ఎస్‌ఐ చిరంజీవి జేఆర్‌పురం ఇన్‌చార్జ్‌ ఎస్‌ఐగా నియమించారు.   

నేనేంటో అందరికీ తెలుసు
జేఆర్‌పురం పోలీస్‌స్టేషన్‌ ఎస్‌ఐగా కొంత కాలంగా పనిచేస్తున్నాను. నేనేంటో అందరికీ తెలుసు. రణస్థలం మండలంలో ఎవర్ని అడిగినా చెబుతారు. నేనెలాంటి తప్పు చేయలేదు. నా ఇల్లు రణస్థలం నడిబొడ్డున ఉంది. ఆరోపణల్లో వాస్తవం లేదు. ఇలాంటి ఫిర్యాదును నమ్మలేకపోతున్నాను. మా కుటుంబమంతా ఆందోళన చెందుతోంది. తలెత్తుకోలేని పరిస్థితిలో ఉన్నాం. విచారణలో వాస్తవాలు బయటపడతాయి. కానీ ఈ లోగా నాకు ఎంత చెడ్డ పేరు. దుష్ప్రచారం జరిగిపోతోంది. మా కుటుంబం ఏమైపోవాలి. ఉద్దేశపూర్వకమైన ఫిర్యాదిది.– అశోక్‌బాబు,ఎస్‌ఐ, జేఆర్‌పురం పోలీసు స్టేషన్‌.  

ఫిర్యాదు మేరకు కేసు నమోదు  
మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశాం. విచారణపై ప్రభావం చూపుతుందని ఎస్‌ఐను అక్కడి నుంచి తప్పించాం. ప్రస్తుతం వీఆర్‌లోకి పంపించాం. విచారణ తర్వాత వాస్తవాలు బయటపడతాయి. తదనంతరం శాఖా పరమైన చర్యలు ఉంటాయి.  – ఎల్‌.కె.వి.రంగారావు,డిఐజీ, ఆర్‌.ఎన్‌.అమ్మిరెడ్డి, జిల్లా ఎస్పీ 

మరిన్ని వార్తలు