‘డర్టీ మార్టినీ’పై మూడు కేసులు

20 May, 2019 11:12 IST|Sakshi

బంజారాహిల్స్‌: జూబ్లీహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 36లోని అల్కజర్‌ మాల్‌ ఐదో అంతస్తులో ఉన్న డర్టీ మార్టినీ రెస్టో కేఫ్‌ బార్‌పై తూనికలు, కొలతల శాఖ అధికారులు శనివారం అర్ధరాత్రి దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా యాజమాన్యం వినియోగదారుల నుంచి 10శాతం సర్వీస్‌ చార్జీలను అక్రమంగా వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. అలాగే మద్యం సరఫరాలో 25 శాతం గండి కొడుతూ సరఫరా చేస్తున్నారని గుర్తించారు. గ్లాస్‌ బీరు ఇవ్వాల్సిన చోట ముప్పావు గ్లాసు బీరు మాత్రమే ఇస్తున్నట్లు తేలింది. 60 మిల్లీ లీటర్ల విస్కీ ఆర్డర్‌ చేస్తే 45 ఎంఎల్‌ మాత్రమే సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. అలాగే బిల్లుల్లో కూడా రూ.457 దోపిడీకి పాల్పడుతున్నారని వెల్లడించారు.

అలాగే రూ.99 విలువ చేసే రెడ్‌బుల్‌ను రూ.275కు విక్రయిస్తున్నట్లు తేలింది. దీంతో బిల్లింగ్‌ సిస్టమ్‌ను అధికారులు సీజ్‌ చేశారు. కేఫ్‌పై కేసు నమోదు చేశారు. చాలా వరకు అక్రమాలు గుర్తించినట్లు అధికారులు తెలిపారు. మద్యం మత్తులో వినియోగదారులు ఇవేమీ చూసుకోవడం లేదని ఈ బలహీనతను ఆసరాగా చేసుకుంటున్న కేఫ్‌ బార్‌ యాజమాన్యం అడ్డగోలుగా వసూళ్లకు తెగబడుతోందన్నారు. మూడు గంటల పాటు అధికారులు ఈ తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా అధికారులకు విస్తుబోయే అక్రమాలు కనిపించాయి. ఈ తనిఖీల్లో తూనికలు, కొలతల శాఖ హైదరాబాద్‌ జిల్లా అసిస్టెంట్‌ కంట్రోలర్‌ భాస్కర్‌రెడ్డి కూడా పాల్గొన్నారు. డర్టీ మార్టినీ రెస్టో కేఫ్‌ బార్‌పై మూడు కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. 

మరిన్ని వార్తలు