‘గ్లోబల్‌ ఆస్పత్రి’ ఘటనపై రెండు కేసులు

26 Dec, 2018 10:25 IST|Sakshi

సాక్షి, సిటీబ్యూరో:లక్డీకాపూల్‌లోని గ్లెనిగల్స్‌ గ్లోబల్‌ ఆస్పత్రికి సంబంధించి ఆదివారం రాత్రి చోటు చేసుకున్న ఘటనలపై రెండు కేసులు నమోదు చేసినట్లు మధ్య మండల డీసీపీ విశ్వప్రసాద్‌ సోమవారం వెల్లడించారు. ఈ కేసులను అన్ని కోణాల్లోనూ సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నామన్నారు. సంతోష్‌నగర్‌కు చెందిన షమీనా బేగం ఊపిరి తిత్తులకు సంబంధించిన సమస్యతో ఈ నెల 18న గ్లోబల్‌ ఆస్పత్రిలో చేరింది. ఈమెకు జరుగుతున్న వైద్యాన్ని కుమారులు మొయినుద్దీన్‌ అలీ ఖాన్, బర్కత్‌ అలీ ఖాన్, ముజఫర్‌ అలీ ఖాన్‌లతో పాటు కుమార్తెలు పర్యవేక్షిస్తున్నారు.

స్వైన్‌ఫ్లూ సైతం సోకడంతో షమీనా ఆదివారం రాత్రి మృతి చెందింది. ఎంఐసీయూలో ఆమెకు వైద్యులు సీపీఆర్‌ ట్రీట్‌మెంట్‌ చేస్తుండగా చూసిన కుమారులు వైద్యులపై ఆరోపణలు చేస్తూ విధ్వంసానికి దిగారు. ఘటనాస్థలికి వెళ్లిన పోలీసులను అడ్డుకుని వారిపై దాడి చేశారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తన తల్లి చనిపోయిందంటూ వారు ఇచ్చిన ఫిర్యాదుతో అనుమానాస్పద మృతి కేసు, ఆస్పత్రి భద్రతాధికారి ఇచ్చిన ఫిర్యాదుతో మొయినుద్దీన్‌ తదితరులపై వివిధ సెక్షన్ల కింద మరో కేసు నమోదు చేసినట్లు డీసీపీ తెలిపారు. ఈ కేసులో వైద్యులు, ఆస్పత్రులపై దాడులు నిరోధించడానికి అమలులోకి వచ్చిన చట్టాన్ని తొలిసారి ప్రయోగించామని, దీని ప్రకారం ఆస్తినష్టాన్ని సైతం నిందితుల నుంచి వసూలు చేసే అవకాశం ఉందన్నారు.

మరిన్ని వార్తలు