పెళ్లికి నిరాకరించిన వరుడిపై కేసు నమోదు

25 Jun, 2019 09:37 IST|Sakshi

కృష్ణాజిల్లా, క్రోసూరు(పెదకూరపాడు): వధువు తమ కులానికి చెందినది కాదంటూ ముహూర్త సమయంలో వివాహం రద్దు  చేసుకున్న వరుడిపై క్రోసూరు పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎస్‌ఐ పి.జనార్ధన్‌ తెలిపిన వివరాల మేరకు మండలంలోని గాదెవారిపాలెం గ్రామానికి చెందిన వధువు (బీసీ) తో సత్తెనపల్లి మండలంలోని గుడిపూడి గ్రామానికి చెందిన అగ్రవర్ణానికి చెందిన వరుడికి వివాహం నిశ్చయమైంది.

ఇద్దరికీ ఇది రెండో వివాహం. ఈనెల 22 న పెదకాకాని శివాలయంలో వివాహం జరగాల్సి ఉండగా, ముహూర్త సమయంలో వధువు తండ్రి ఆధార్‌ కార్డులోని పేరు, పెండ్లి పత్రికల్లో ఉన్న పేరు తేడా ఉండటాన్ని గుర్తించి.. వరుడు, వరుడి బంధువులు.. వధువు తమ సామాజిక వర్గానికి చెందినది కాదంటూ వివాహం రద్దు చేసుకుని వెళ్లిపోయారు. దీనిపై వధువు తండ్రి ఆదివారం పెదకాకాని పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, క్రోసూరులో ఫిర్యాదు చేయమని చెప్పి పంపారు. దీంతో వధువు తండ్రి సోమవారం క్రోసూరు స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. సీఐ వెంకట్రావు ఇరు కుటుంబాలను కౌన్సెలింగ్‌కు పంపించాలని ఆదేశించినట్లు ఎస్‌ఐ తెలిపారు. అయితే వరుడు పరారీలో ఉన్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

మరిన్ని వార్తలు