ఎమ్మెల్యే చింతమనేనిపై కేసు నమోదు

21 Sep, 2018 06:27 IST|Sakshi

 ఐఎంఎల్‌ డిపో హమాలీ మేస్త్రిని కొట్టి, కులం పేరుతో దూషించిన ఘటనలో..

దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై ఎట్టకేలకు ఏలూరు త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. అతని అనుచరులు నేతల రవి, చుక్కా వెంకటేశ్వరరావుతోపాటు  ముగ్గురు గన్‌మెన్‌లపైనా కేసు నమోదైంది.

పశ్చిమగోదావరి, ఏలూరు టౌన్‌: దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై ఎట్టకేలకు ఏలూరు త్రీటౌన్‌ పో లీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. అతని అనుచ రు లు నేతల రవి, చుక్కా వెంకటేశ్వరరావుతోపాటు  ముగ్గురు గన్‌మెన్‌లపైనా కేసు నమోదు చేశారు. ఏలూరు రైల్వేస్టేషన్‌ సమీపంలోని ఐఎంఎల్‌ డిపో హమాలీ  మేస్త్రి రాచీటి జాన్‌ను ఎమ్మెల్యే ప్రభాకర్‌ తన ఇంటికి పిలిపించుకుని కొట్టి, కులంపేరుతో దూషించిన ఘటనపై కార్మిక, దళిత  సంఘాలు, వామపక్ష ఇతర రాజకీయ పార్టీలు పది రోజులుగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేయటంతో చేసేదిలేక పోలీస్‌ అధికారులు కేసు నమోదు చేశారు. చింతమనేనిపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం, ఐపీసీ 323 సెక్షన్‌ కింద కేసు నమోదు చేశారు.

ఐఎంఎల్‌ డిపోలో ఓ హమాలీ సక్రమంగా పనిచేయక పోవటంతో హమాలీ మేస్త్రి రాచీటి జాన్‌ అతడిని పనిలోనుంచి తొలగించాడు. ఈ విషయంపై ఎమ్మెల్యే చింతమనేని మేస్త్రి జాన్‌ను ఇంటికి పిలిపించి పంచాయితీ పెట్టారు. తొలగించిన కార్మికుడిని తిరిగి పనిలో పెట్టుకోవాలని హుకుం జారీ చేశారు. తమ కార్మిక సంఘం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న అతడిని పనిలో పెట్టుకోవటం కుదరదని జాన్‌ చెప్పటంతో, ఆగ్రహం వ్యక్తం చేస్తూ అతనిపై చింతమనేని దాడికి పాల్పడ్డారు. కొట్టటంతోపాటు, కులం పేరుతో దూషించారు. ఈ విషయంపై కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఆందోళనలు పెద్ద ఎత్తున చేపట్టారు. ఈనెల 10న సంఘటన జరగగా 11న కార్మిక సంఘాలు, వామపక్ష నేతలు, బాధితుడు జాన్‌ త్రీటౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుకు ఈనెల 14 వరకూ పోలీసులు కనీసం రశీదు కూడా ఇవ్వలేదు. కేసు నమోదు చేయకపోవటంపై వామపక్ష పార్టీలు, కార్మిక, దళిత సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలన్నీ అఖిలపక్షంగా ఏర్పడి ఉద్యమాన్ని చేపట్టాయి. చింతమనేనిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని ఎస్పీ ఎం.రవిప్రకాష్‌కు బుధవారం వినతిపత్రం సమర్పించారు. గురువారం ఉదయం  కలెక్టరేట్‌ వద్ద రిలేనిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో గురువారం సాయంత్రం త్రీటౌన్‌ పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్ట్, ఐపీసీ 323 కింద కేసు నమోదు చేశారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా