ఎమ్మార్పీ దాటితే చర్యలు

9 Nov, 2017 12:46 IST|Sakshi
సింధు హోటల్‌ యజమానిపై కేసు నమోదు చేస్తున్న రామకృష్ణ

జీఎస్టీ పేరుతో వినియోగదారులపై భారం మోపొద్దు

అక్టోబర్‌ 27 నుంచి 200 కేసులు, రూ.72 లక్షల జరిమానా

నల్లగొండ జోన్‌ అసిస్టెంట్‌ కంట్రోలర్‌ రామకృష్ణ

మహబూబ్‌నగర్‌ క్రైం: వస్తువులపై, బాటిల్స్‌పై ఉన్న ఎమ్మార్పీ కంటే ఒక్క రూపాయి ఎక్కువ తీసుకున్నా.. జీఎస్టీ లేకున్నా ఉన్నట్లు బిల్లులో జోడించి అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని లీగల్‌ మెట్రాలజీ డిపార్ట్‌మెంట్‌ నల్లగొండ జోన్‌ అసిస్టెంట్‌ కంట్రోలర్‌ టి.రామకృష్ణ అన్నారు. ఆయన ఆధ్వర్యంలో బుధవారం జిల్లావ్యాప్తంగా  దాడులు నిర్వహించారు. ముందుగా బాలానగర్‌లోని కిల్‌పార్క్‌ హోటల్‌లో తనిఖీలు చేయగా ఎమ్మార్పీ కంటే అదనంగా వసూలు చేస్తున్నట్లు గుర్తించి కేసు నమోదు చేశారు. అలాగే ఎం ఫుడ్‌కోర్ట్, ఆకాష్‌ గ్రాండ్‌లో అధిక ధరలకు అమ్ముతున్నట్లు వచ్చిన సమాచారం మేరుకు తనిఖీలు చేసి.. కేసులు నమోదు చేశారు. మహబూబ్‌నగర్‌లోని సింధూ హోటల్‌లో సైతం అన్నింటిపై ఎమ్మార్పీ కంటే అదనంగా రూ.5–10 వసూలు చేస్తున్నట్లు గుర్తించి కేసు నమోదు చేశారు.

ఫిర్యాదు చేయండి..
ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఆదేశాల మేరకు గత నెల 27 నుంచి ఎమ్మార్పీపై, జీఎస్టీపై తనిఖీలు చేస్తున్నట్లు చెప్పారు. జూలై నుంచి అమల్లోకి వచ్చిన జీఎస్టీని కలిపి అదనంగా వినియోగదారులపై భారం మోపుతున్నారని ఇలాంటి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఒక వస్తువును కొనుగోలు చేసే సమయంలో వస్తువ ఎమ్మార్పీ ఎంత ఉందో వినియోగదారులు చూసుకోవాలని ఆ ధర మాత్రమే చెల్లించాలన్నారు. ఎక్కడైనా ఎమ్మార్పీ కంటే అదనంగా వసూలు చేస్తున్నట్లు అయితే సెల్‌ నం. 9490165619కు ఫిర్యాదు చేయాలని సూచించారు. వ్యాపారులు ఎక్కడా మాల్‌ ప్రాక్టీసింగ్‌కు పాల్పడరాదని చట్టప్రకారం నడుచుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

దక్కని జీఎస్టీ ఫలితాలు..
జీఎస్టీ తగ్గిన వస్తువుల ధరలను వినియోగదారులకు ఫలితం దక్కకుండా పాత ధరలకు అమ్ముతున్నారని అలాంటి వారిపై నిఘా పెట్టినట్లు చెప్పారు. అక్టోబర్‌ 27 నుంచి ఇప్పటి వరకు 200 కేసులతోపాటు రూ.72 లక్షల జరిమానా విధించామన్నారు.  ఉమ్మడి జిల్లాలో మొత్తం నాలుగు బృందాలుగా ఏర్పాడి అదనపు ధరలపై తనిఖీలు చేస్తున్నామన్నారు. ఇక నుంచి ప్రతినెలలో ఓసారి ఉమ్మడి జిల్లాలో దాడులు చేపడుతామన్నారు. ఉత్పత్తి చేసే కంపెనీ చిరునామా.. ఈమెయిల్‌ ఐడీ, ఫోన్‌ నంబర్‌ తప్పక ఉండాలన్నారు. ప్రధానంగా పెట్రోల్‌ బంకులు, పెద్ద పెద్ద వస్త్ర దుకాణాలపై ప్రత్యేక  నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. దాడులు చేసిన బృందంలో మహబూబ్‌నగర్‌ డీఎల్‌ఎంఓ రవీం దర్‌ ఇతర సిబ్బంది ఉన్నారు.

మరిన్ని వార్తలు