మాజీ స్పీకర్‌ కోడెలపై కేసు నమోదు

25 Aug, 2019 04:17 IST|Sakshi

అసెంబ్లీ ఫర్నిచర్‌ను తన క్యాంపు కార్యాలయంలో భద్రపరిచానన్న కోడెల 

ఆ ఫర్నిచర్‌ను అతని కుమారుడి షోరూమ్‌లో వినియోగిస్తున్నట్టు అధికారుల నిర్ధారణ  

మాజీ స్పీకర్‌ కుమారుడు శివరామ్‌పై సైతం కేసు నమోదు

సాక్షి, గుంటూరు: అసెంబ్లీ ఫర్నిచర్‌ను తన కార్యాలయాలు, ఇల్లు, కుమారుడి షోరూమ్‌లో ఉంచి వినియోగించుకుంటున్న మాజీ స్పీకర్‌ కోడెల శివప్రసాదరావుపై తుళ్లూరు పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. అసెంబ్లీ సెక్షన్‌ ఆఫీసర్‌ ఈశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కోడెలపై ఐపీసీ 409 సెక్షన్‌ కింద, తనది కాని ప్రభుత్వ ఆస్తిని షోరూంలో ఉంచుకుని వినియోగిస్తున్న కోడెల శివరామ్‌పై ఐపీసీ 414 సెక్షన్‌ కింద కేసు నమోదైంది. అసెంబ్లీ ఫర్నిచర్‌ను కోడెల తన ఇంటికి మళ్లించిన వ్యవహారం బట్టబయలైన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో అసెంబ్లీలో భద్రత లేక తన క్యాంపు కార్యాలయాల్లో ఆ ఫర్నిచర్‌ను భద్రపరిచానని కోడెల చెప్పడం, అది ఆయన కుమారుడు శివరామ్‌కు చెందిన షోరూంలో కూడా వినియోగిస్తున్న తరుణంలో శుక్రవారం అసెంబ్లీ అధికారులు తనిఖీలు చేపట్టారు. గుంటూరులోని గౌతమ్‌ హీరో షోరూమ్‌లో రూ.కోట్ల అసెంబ్లీ ఫర్నిచర్‌ ఉందని తనిఖీల్లో గుర్తించారు. నిబంధనలకు విరుద్ధంగా అసెంబ్లీ ఫర్నిచర్‌ను ఉంచి, వినియోగిస్తున్న కోడెల, శివరామ్‌లపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేశారు. 

మరిన్ని వార్తలు